
IPL 2027 Auction : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జరగబోయే వేలంలో అందుబాటులో ఉండే ఆటగాళ్లు ఎవరనే దానికంటే.. సీజన్ ప్రారంభమైనప్పుడు నిజంగా ఎవరు అందుబాటులో ఉంటారనే ప్రశ్నే కీలకంగా మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండటంతో ఆ జట్టుకు చెందిన పలువురు స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2027లో పూర్తిస్థాయిలో ఆడతారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఇప్పటికే ఆటగాళ్ల ఐపీఎల్ అందుబాటుపై తుది నిర్ణయం భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ అనంతరం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వేలం సమయంలో ఎలా వ్యవహరిస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టార్ ఆటగాళ్లకు భారీ ధరలు.. ఐపీఎల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది. 2024 వేలంలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర. అదే వేలంలో ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. అయితే 2027 వేలంలో ఆటగాడి ప్రతిభతో పాటు అతని అందుబాటు కూడా ధరను నిర్ణయించే కీలక అంశంగా మారవచ్చు. స్టార్ ఆటగాడు దూరమైతే ప్రత్యామ్నాయం దొరకడం కష్టమే.. ఒక ఫ్రాంచైజీ భారీ మొత్తానికి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. అతను అంతర్జాతీయ బాధ్యతల కారణంగా ఐపీఎల్‌కు దూరమైతే ఆ జట్టుకు సమస్యలు ఎదురవుతాయి. ఆ స్థాయి ఆటగాడిని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం ప్రాంఛైజీకి కష్టమవుతుంది. ఐపీఎల్ జట్టులో గరిష్ఠంగా ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకునే అవకాశం ఉండటంతో ప్రతి విదేశీ స్లాట్‌కు ప్రత్యేక విలువ ఉంటుంది. స్టార్ ఆటగాళ్లు తగ్గితే.. మిగిలిన వారికి భారీ ధరలు? ఇక్కడే వేలంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోవచ్చు. పలువురు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే ఫ్రాంచైజీల అవసరం మాత్రం తగ్గదు. ఉదాహరణకు ఒక జట్టు స్టార్ ఓపెనర్ అందుబాటులో ఉండకపోవచ్చని భావిస్తే.. అదే స్థానాన్ని భర్తీ చేయగల మరో విదేశీ ఓపెనర్ కోసం పోటీ పడుతుంది. దీంతో ఒకప్పుడు రూ.5-8 కోట్లకు దొరికే ఆటగాడి కోసం రూ.10-12 కోట్ల వరకు ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు. IPL ఫ్రాంచైజీల పర్స్ కూడా 2027 నాటికి పెరగనుంది. 2026లో ఒక్కో ఫ్రాంచైజీకి రూ.151 కోట్లుగా ఉన్న సాలరీ క్యాప్ 2027లో రూ.157 కోట్లకు పెరగనుంది. అలాగే మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు వారి కాంట్రాక్ట్ జీతానికి అదనంగా రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును కూడా ఐపీఎల్ ప్రవేశపెట్టింది. పెద్ద పర్స్ కారణంగా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లపై మరింత భారీగా ఖర్చు చేయగలవు. అయితే ఆటగాడు సీజన్లో అందుబాటులో లేకపోతే ఆ పెట్టుబడి వృథాగా మారుతుంది. 2023 అనుభవం ఫ్రాంచైజీలకు హెచ్చరిక 2023లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన విషయం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఏడాది ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ ఐపీఎల్‌కు దూరంగా ఉండి భారత్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఆ తర్వాత యాషెస్ సిరీస్‌పై దృష్టి పెట్టారు. అదే విధంగా 2027లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండే అవకాశం ఉంది. భారత్‌తో టెస్ట్ సిరీస్, డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్‌తో పాటు 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహాలు కూడా ఆస్ట్రేలియా షెడ్యూల్లో ఉన్నాయి. అందుకే ఆటగాళ్లందరికీ ఒకే నిర్ణయం కాకుండా.. ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెక్‌డొనాల్డ్ కూడా ఆటగాళ్లను వ్యక్తిగతంగా అంచనా వేస్తామని, ప్రస్తుతానికి వారు ఐపీఎల్లో ఆడగలరనే ఉద్దేశంతో ఉన్నామని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్యాకప్ ఆటగాళ్లకు డిమాండ్ పెరిగే అవకాశం.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక తదితర దేశాల ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు దృష్టి సారించే అవకాశం ఉంది. దీంతో బ్యాకప్ ఆటగాళ్లకు కూడా భారీ ధరలు పలికే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్ల విషయంలో ఏర్పడే అనిశ్చితి.. వారి ధరలకే పరిమితం కాకుండా, వేలంలో మిగిలిన విదేశీ ఆటగాళ్ల ధరలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఐపీఎల్ 2027 వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రభావం వారు కొనబడతారా లేదా అన్నదానికంటే.. వారి గైర్హాజరు కారణంగా ఇతర ఆటగాళ్లు ఎంత లాభపడతారో అన్నదానిపై కనిపించవచ్చు.





