
Home » National » BRICS Gala Dinner Rahul Gandhi Non Vegetarian Menu Viral Post BSB
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన విందు రాజకీయ చర్చకు తెరలేపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన ఈ విందులో పూర్తిగా శాకాహారమే వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన విందు కార్యక్రమం రాజకీయ చర్చకు తెరలేపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన ఈ విందులో పూర్తిగా శాకాహారమే వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మాంసాహారం తీసుకుంటారని ప్రస్తావిస్తూ.. భారతీయ నాన్వెజిటేరియన్ వంటకాలకూ అంతర్జాతీయ వేదికపై చోటు ఉండాల్సిందని సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఆయన అభిప్రాయపడ్డారు. '80 శాతం మంది భారతీయులు మాంసాహారులు. భారతీయ నాన్‌వెజ్ వంటకాలు రుచిగా ఉంటాయి. అలాగే నా సోదరి చోలే భటూరే కూడా' అని తన వ్యాఖ్యకు సరదా టచ్ ఇస్తూ చోలే భటూరేను ప్రస్తావించారు రాహుల్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా.. బ్రిక్స్ సదస్సు సందర్భంగా శనివారం రాత్రి ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ విదేశీ నేతలు, ప్రతినిధుల కోసం గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో భారతీయ ప్రాంతీయ వంటకాల వైవిధ్యాన్ని పరిచయం చేసేలా ప్రత్యేక శాకాహార మెనూను రూపొందించారు. మొదటి వంటకాలుగా ఖాండ్వీ మిల్లే-ఫెయ్, ఖుంబ్ గలౌటీ వంటివి అందించారు. సంప్రదాయ భారతీయ వంటకాలకు ఆధునిక రూపునిచ్చి అంతర్జాతీయ అతిథులకు అందించడం ఈ మెనూ ప్రత్యేకతగా నిలిచింది.
పన్నీర్.. గుచ్చి.. మిల్లెట్ పులావ్
ప్రధాన వంటకాలలో పన్నీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, క్యారెట్ బీన్ పొరియల్, థక్కాళి బెల్లె సారు ఉన్నాయి. వీటితో పాటు మిల్లెట్ పులావ్, బీట్రూట్ రాయితా, వివిధ రకాల భారతీయ రొట్టెలు వడ్డించారు. మెనూలో ముఖ్యంగా చిరుధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పులావ్‌లో సజ్జలు, రొట్టెల్లో జొన్నలు, డెజర్ట్‌లో కొర్ర వంటి చిరుధాన్యాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పోషకాహారం, స్థిరమైన వ్యవసాయం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటేలా మెనూను రూపొందించినట్లు సమాచారం. ఇక భోజనం చివర్లోనూ భారతీయతకు పెద్దపీట వేస్తూ.. ఓల్డ్ ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్‌తో జిలేబీ, షాహ్తూత్ ఫిర్నీ వంటి మిఠాయిలను అందించారు. మల్బెర్రీ పండ్లతో అలంకరించిన ఫిర్నీకి ఆధునిక రూపాన్నిచ్చారు.
అంతర్జాతీయ నేతలు పాల్గొన్న విందులో భారతీయ ఆహార సంస్కృతిలోని ముఖ్య భాగమైన నాన్‌వెజ్ వంటకాలూ కూడా ఉండాల్సిందన్న రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో ఆహారపు అలవాట్లపై మొదలైన చర్చ కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. రాహుల్ పోస్ట్‌పై అధికారపక్షం స్పందిస్తూ.. విందు మెనూను రాజకీయ అంశంగా మార్చుతున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, సాంకేతికత, ఆరోగ్యం, గ్లోబల్ సౌత్ వంటి కీలక అంశాలపై చర్చలకు ప్రధాన వేదికైన బ్రిక్స్‌లో.. అనూహ్యంగా 'వెజ్ వర్సెస్ నాన్‌వెజ్' మెనూ హాట్ టాపిక్‌గా మారింది.
బ్రిక్స్ కూటమి మాత్రమే కాదు.. పరిష్కారాల వ్యవస్థ: ప్రధాని మోదీ
బ్రిక్స్ సదస్సు ముగింపు: ఢిల్లీ నుంచి స్వదేశాలకు దేశాధినేతల పయనం






