© 2026 nimisham.in
తిరుమలలో వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా గురువారం తిరుమల పద్మావతి అతిథి గృహం వద్ద నాలుగు కాళ్ల రోబోట్ డాగ్ పనితీరును టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లేందుకు ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్ డాగ్‌ను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.ఈ రోబోట్ డాగ్లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నాయి. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి సమయాల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రోబోట్‌లోని ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యం కలిగి ఉంది. వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో-ట్యాగ్డ్ అలర్ట్‌ను పంపించడం.. లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించేలా దీనిని రూపొందించారు.దీని ద్వారా అలిపిరి కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయవచ్చని టీటీడీ భావిస్తోంది. అలాగే ఈ సమాచారాన్ని అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బందికి వేగంగా స్పందించేందుకు ఈ రోబోట్ డాగ్ ఉపయోగపడుతుందని భావిస్తు్న్నారు. వన్యప్రాణులు భక్తుల వైపు వచ్చినప్పుడు రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి... వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ఉన్న అవకాశాలను కూడా టీటీడీ పరిశీలిస్తోంది. అటవీ ప్రాంతాల్లో రోబోట్ డాగ్ ద్వారా సేకరించే సమాచారాన్ని విశ్లేషించి..అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్ సమయాలు, నిఘాను మెరుగుపరచవచ్చని టీటీడీ భావిస్తోంది.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.






