టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు ( Tollywood Celebrities ) హైదరాబాద్‌లోని తమ ఓటును వదులుకున్నారా? తమ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే తమ ఓటు హక్కును కొనసాగించడానికి మొగ్గు చూపారా? అంటే అవుననే అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) ప్రక్రియలో తెలుగు చలనచిత్ర సీమకు చెందిన సెలబ్రిటీలు తమ ఓటును స్వంత రాష్ట్రానికి మార్చుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన టాలీవుడ్ ప్రముఖులు, ఇతర పరిశ్రమలకు చెందినవారు ఇక్కడి ఓటును వదులుకుని, తమ సొంత ఊర్లలోనే ఓటర్లుగా కొనసాగేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.ఏపీలోని స్వగ్రామాలకు సినీ ప్రముఖుల ఓట్లుఈ విషయమై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) కార్యాలయ అధికారులు స్పందిస్తూ.. బడా సినీ కుటుంబాలతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వగ్రామాలకే ఓటు విషయంలో ప్రాధాన్యత ఇచ్చినట్టు ధ్రువీకరించారు. ‘‘మా అధికారులు, బూత్ స్థాయి అధికారులు (BLOలు) వారిని సంప్రదించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత ఊర్లలోనే ఓటు హక్కును ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సినీ ప్రముఖులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంతోకాలంగా నివసిస్తున్నప్పటికీ ఇక్కడి ఓటును తొలగించుకుని ఏపీలోనే తమ ఓటును ఉంచుకోవడానికే వారు సుముఖత వ్యక్తం చేశారు’’ అని అధికారులు పేర్కొన్నారు.నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన నివాస కేంద్రంగా ఉంది. వీరు దశాబ్దాలుగా ఇక్కడే నివాసముంటూ సొంత ఇళ్లను కూడా కలిగి ఉన్నారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఎక్కువ భాగాన్ని ఇక్కడే గడుపుతున్నారు.అత్యధికంగా జూబ్లీహిల్స్లోనే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోయిన హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్న జూబ్లీహిల్స్లోనే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 1,48,859 మంది ఓటర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తేలింది. అలాగే 8,232 మంది ఓటర్లు మరణించినట్లు, 13,500 మంది అడ్రస్ లభ్యం కాలేదు. మరో 7,279 మంది ఇదివరకే ఇతర ప్రాంతాల్లో నమోదు చేసుకున్నట్లు వెల్లడైంది.తమ స్వగ్రామాలతో అనుబంధాన్ని కొనసాగించాలనే ఆలోచనే ప్రముఖులు అక్కడ ఓటు హక్కును కొనసాగించడానికి ప్రధాన కారణమని తెలంగాణ సీఈఓ అధికారులు తెలిపారు. వారికి సొంత ఊర్లలో వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు ఉండటం కూడా ఈ నిర్ణయానికి మరో కారణమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మార్పులు, చేర్పుల అనంతరం ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలను సెప్టెంబరు 16లోగా సమర్పించాల్సి ఉంటుంది. అనామలిస్ జాబితాలో ఏకంగా 93 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరికి నోటీసులు ఇచ్చి, సరైన పత్రాలు చూపించకపోతే జాబితా నుంచి తొలగిస్తారు.





