తెలుగు సినిమా చరిత్రను "చిరంజీవికి ముందు... చిరంజీవి తర్వాత" అని విభజించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థియేటర్లలో ఈలల వర్షం కురిసినా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలన్నా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మెగాస్టార్ చిరంజీవి . సామాన్య కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి మద్రాసు వీధుల్లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చిరంజీవి ఆనాడు పరిశ్రమలో దిగ్గజ హీరోల హవా నడుస్తున్న సమయంలో కేవలం తన అద్వితీయమైన నటన, అద్భుతమైన డ్యాన్స్ శైలి, ఫైట్లలో సరికొత్త వేగంతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ‘పునాదిరాళ్లు’తో తన కెరీర్‌కి పునాది వేసుకున్న చిరంజీవి సుప్రీం హీరోగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు పొంది మెగాస్టార్‌గా రూపాంతరం చెంది ఇప్పుడు ఒక్క కంటిసైగతో యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరుకున్నారు. నేడు (ఆగస్టు 22) చిరంజీవి తన 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మెగాస్టార్ పుట్టినరోజంటే కోట్లాది మంది అభిమానులకు ఒక పండుగ రోజు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన చిరంజీవికి చిన్న వయసు నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో యుక్త వయసు రాగానే మద్రాస్ చేరుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 1978లో "పునాదిరాళ్ళు", "ప్రాణం ఖరీదు" చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలన్‌గా, సహాయ నటుడిగా, యాంటీ హీరోగా వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన "మనవూరి పాండవులు", కె. విశ్వనాథ్ గారి "శుభలేఖ" లాంటి చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి.ఖైదీతో సంచలనం1983లో విడుదలైన "ఖైదీ" చిత్రం తెలుగు చిత్రసీమ గమనాన్ని మార్చేసింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా, చిరంజీవిని మాస్ హీరోగా తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. చిరంజీవి రాకతో తెలుగు సినిమాల్లో యాక్షన్ శైలి మారింది; డ్యాన్స్‌ల రూపురేఖలు మారిపోయాయి. గ్రేస్, స్పీడ్, ఎనర్జీల కలయికగా ఆయన వేసిన స్టెప్పులు యువతను ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నేషనల్ మ్యాగజైన్స్ మీద కవర్ పేజీలతో తన సత్తా చాటారు. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా ‘రుద్రవీణ’, ‘ఆపద్బాంధవుడు’, ‘స్వయంకృషి’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో నంది, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను దక్కించుకుని తనలోని నటుడి స్థాయిని మరింత పెంచారు.అభిమానుల గుండెచప్పుడు చిరంజీవిచిరంజీవి సాధించిన విజయాల వెనుక కోట్లాది మంది అభిమానుల అచంచలమైన ప్రేమ దాగి ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీకి ఫిదా అయిపోయిన అభిమానులు ఆయన్ని తమ సొంత కుటుంబ సభ్యుడిలా ఆదరించారు. తరాలు మారినా, కొత్త హీరోలు వచ్చినా ఆయన క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ రంగ ప్రవేశం కారణంగా దాదాపు దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఖైదీ నంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్య, మన శంకర వరప్రసాద్ గారు.. చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి తన స్టార్డమ్కు తిరుగులేదని మరోసారి నిరూపించారు.రక్తదాతల సైన్యం - చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కేవలం తెరపై వినోదాన్ని పంచడానికే పరిమితం కాకుండా, సమాజం పట్ల బాధ్యతను చాటుకోవడంలోనూ చిరంజీవి ముందున్నారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఎందరో ప్రాణాలను నిలబెట్టాయి. రక్తదానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, లక్షలాది మంది అభిమానులను రక్తదాతలుగా మార్చిన ఘనత ఆయనది. విపత్కర కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవడానికి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని స్థాపించి అండగా నిలిచారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించారు.కళా రంగానికి, సమాజానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలకు గాను భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ వంటి దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో ఘనంగా సత్కరించింది. నేటికీ యువ హీరోలతో సమానంగా భారీ చిత్రాలతో అలరిస్తూ, కొత్త ప్రాజెక్ట్‌లతో నిరంతరం బిజీగా ఉంటూ పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలుస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంతో వర్ధిల్లాలని కోరుకుంటూ కోట్లాది మంది అభిమానులు ఆయన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.