
© 2026 nimisham.in

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మెగా కుటుంబానికి ఏ రేంజ్ భక్తుడో కూడా వివరించాల్సిన అవసరం లేదు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మెగా కుటుంబానికి ఏ రేంజ్ భక్తుడో కూడా వివరించాల్సిన అవసరం లేదు. బండ్లన్న స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చాలాకాలం తరువాత ఒక మెగా భక్తుడుగా బండ్ల స్పీచ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ తో అదరగొట్టేశాడు. ఏడుకొండల వెంకన్న సాక్షిగా నిజాలే మాట్లాడతా..అంటూ మొదలుపెట్టి చిరంజీవి వ్యక్తిత్వం, మంచి మనసు అన్నింటినీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
'ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు, అంజనమ్మల కడుపున చిరంజీవి జన్మించారో కానీ, గత 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలుగుతూ, అభిమానులను రక్షిస్తూ, ఎందరికో జీవనాధారాన్ని కల్పిస్తూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఈరోజు ఏడుకొండల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాద్రి అప్పన్న, యాదగిరిగుట్ట నరసింహస్వామి మరియు నేను కొలిచే అయ్యప్ప స్వామి సాక్షిగా మెగాస్టార్ క్యారెక్టర్, కెపాసిటీ, క్యాలిబర్, వ్యక్తిత్వం గురించి నిజాలు మాట్లాడడానికే వచ్చాను.
బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకునే కుర్రాడిలా చెన్నై నగరంలో అడుగుపెట్టి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో చూపించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. నాకు ఆయనంటే ప్రాణం. ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను, తెలుగు ఇండస్ట్రీని చేత్తో పట్టుకొచ్చింది ఆయనే. భారతదేశంలో ఏ నటుడికి దక్కని అద్భుతమైన అదృష్టం రామ్ చరణ్ రూపంలో తన లెగసీని కంటిన్యూ చేయడానికి దక్కింది. ఎంతో మంది స్టార్లు ఉన్నారు కానీ, ఒక మెగాస్టార్‌కు మెగా పవర్ స్టార్‌ను కొడుకుగా ఇచ్చిన ఘనత ఆయన వ్యక్తిత్వానిదే. ఆయన క్యారెక్టర్ భావితరాల భవిష్యత్తుకు ఒక రామాయణం, ఒక భగవద్గీత, భారతదేశ స్వతంత్ర పోరాటంలా అందరి హృదయాల్లో నిలిచిపోతుంది.
ఈ మధ్యనే నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లినప్పుడు అన్నయ్యా కొంచెం లేట్ అయింది ఏంటి? అని అడిగితే.. మా చెల్లికి నడుము నెప్పిగా ఉంటే జెండూబామ్ రాస్తున్నానురా లోపల అని చెప్పారు. ఈ రోజుకీ 85 ఏళ్ల తల్లిని కొడుకులా పట్టుకుని, కాళ్లు ఒత్తుతూ కంటికి రెప్పలా చూసుకునే క్యారెక్టర్ ఆయనది. 25 సంవత్సరాల కిందట అడ్రస్ లేని బండ్ల గణేష్ ఇల్లు కట్టుకున్నాడని తెలిసి, ఆ రోజు శంకర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్‌బస్టర్ కొట్టి యావత్ భారతదేశం ఆయన కోసం చూస్తున్న సమయంలోనూ, తీవ్రమైన నడుము నెప్పితో 50 కిలోమీటర్ల దూరం నా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి ఆశీర్వదించిన గొప్ప మనసు ఆయనది.
పూర్వం ఇంద్రసేనా గోపాలకృష్ణన్ ఫంక్షన్లో నేను కూర్చుని అన్నా మీరు రండి, యాక్ట్ చేయండి, మీకు దండం పెడతాం.. మీరు డాన్స్ చేయాలి అని వేడుకుంటే, మళ్లీ వచ్చి వరుస హిట్లు కొడుతూ దుమ్ము దులుపుతున్నారు. ఆయనలో స్వార్థం ఉంటే నేను, నా కొడుకు మాత్రమే ఉండాలి అనుకునేవారు. కానీ మనం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికీ బంగారు భవిష్యత్తు ఉండాలి అని కోరుకున్న వ్యక్తి ఆయన. చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకపోతే నాలాంటి సామాన్యులు వచ్చేవారు కారు. కష్టపడే ప్రతి ఒక్కడూ ఇండస్ట్రీలో పైకి రాగలడనే భరోసా ఇచ్చింది ఆయనే.
చిరంజీవి గారు ఇతరులను తొక్కేసారని కొందరు మాట్లాడుతుంటారు. చిరంజీవి ఎవరినీ తొక్కడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్, శక్తి, నిజాయితీ ఉంటే వాళ్లను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం. నేను వెళ్లి అన్నయ్యా నా ఇంట్లో ఇది ఉంది అని చెప్పగానే, చెప్పకుండానే ఇంటికి వచ్చేసేంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాలుగా పెట్టి భావితరాల విద్యార్థులకు చెప్పాలి. ఆయన గురించి ఎవరు ఏమైనా మాట్లాడుకున్నా అది అల్పసంతోషమే తప్ప ఆయన మహోన్నత స్థాయి మారదు. అలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని హిట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ స్పీచ్ ముగించాడు. ప్రస్తుతం బండ్ల స్పీచ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








