
హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్‌లో 1,816 మంది అధికంగా మహిళలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. సుమారు నాలుగు లక్షలకు పై చిలుకు ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. సుమారు 44.19 శాతం ఓట్లు జాబితా నుంచి కనుమరుగు కావడంతో వాటిలో కొన్ని ఓట్లైనా తిరిగి రాబట్టుకునేలా కార్యచరణ చేసుకునేందుకు రాజకీయ శిబిరాలు ప్రయత్నాలు ఆరంభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ జాబితాను ఇటీవల ప్రచురించింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.79 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. అత్యధిక ఓట్లు తొలగించబడిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ మూడోస్థానంలో నిలిచింది.
పేరుకు జూబ్లీహిల్స్ అయినప్పటికీ నియోజకవర్గంలో బస్తీలు అత్యధికంగా ఉన్నాయి. మాస్ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ప్రతీ యేట ఇక్కడ ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో సుమారు 79 వేల ఓటర్లు పెరిగారు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రకారం ఒకరికి ఒకే ఓటు అని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మెజారిటీ ఓటర్లు పుట్టిన ఊర్లో ఓటు ఉంచుకునేందుకు మొగ్గు చూపించారు. దీంతో ఓటు శాతం గణనీయంగా తగ్గింది.
ఏకంగా 1.48 లక్షల మంది తమ ఓటును నియోజకవర్గం నుంచి వేరే చోటకు పెట్టుకున్నట్టు షిఫ్టింగ్ జాబితా ప్రకారం తెలుస్తోంది. అంతేగాకుండా ఇక్కడ హాస్టళ్లు కూడా ఎక్కువ ఉండడంతో చాలామంది స్థానిక చిరునామా కోసం ఓటరు కార్డులు చేయించుకున్నారు. ఇవి కూడా ఇప్పుడు తరలి పోయాయని లెక్కలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,219. ఇక్కడ పురుషుల కంటే మహిళలే 1,816 మంది ఎక్కువగా ఉన్నారు. పురుషులు 1,12,697 మంది ఉండగా, మహిళలు 1,14,513 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇతరులు 9 మంది ఉన్నారు. సర్ కన్నా ముందు పురుషులు అధికంగా ఉండే వారు. కానీ ఓటరు సవరణ జాబితా అనంతరం మహిళలు అధికమయ్యారు.
నియోజకవర్గం నుంచి షిఫ్టింగ్ అయిన ఓట్లలో బస్తీలకు చెందినవే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు రహ్మత్‌నగర్, షేక్‌పేట, బోరబండ డివిజన్లలో ఉన్నారు. ఈ మూడు డివిజన్లే ఎన్నికల్లో అత్యంత కీలకంగా ఉండేవి. ఎస్ఐఆర్ అనంతరం ఆయా బస్తీల నుంచే అత్యధిక ఓట్లు తరలివెళ్లాయని అధికారులు చెబుతున్నారు. యూసు్‌ఫగూడలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఓటరు తరలి వెళ్లడంతోపాటు డివిజన్ల పునర్విభజన కూడా చోటుచేసుకోవడంతో రాజకీయ సమీకరణల్లో కూడా మార్పు ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. ఏడు డివిజన్లు ఉన్న నియోజకవర్గంలో పునర్విభజన అనంతరం 12కు పెరిగాయి. దీంతో డివిజన్ల సరిహద్దులు కూడా మారాయి. ఈ రెండు పరిణామాల వల్ల రాజకీయ బలాల్లో కూడా మార్పు ఉంటుందని నాయకులు అంచనాలు వేస్తున్నారు.
ఎస్ఐఆర్ ముసాయిదా ప్రకటించారు. అభ్యంతరాలు తెలియజేసేందుకు అధికారులు నెల రోజుల సమయం ఇచ్చారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షిఫ్ట్ అయిన ఓట్లు పక్కకు పెడితే ఓటరు ఇచ్చిన వివరాలు మ్యాచ్ కాని 53 వేల ఓట్లపై దృష్టి సారించారు. ఇందుకు గల కారణాల గురించి విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఈ నెల రోజులు చేయాల్సిన పని పై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసింది. ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారి ఓట్లు వచ్చాయా లేదా అని చూడటంతో పాటు మాచ్ కానివి, అబ్సెంట్ అయిన వాటిపై దృష్టి సారించాయి. కనీసం 20-30 వేల ఓట్లు పెంచాలనే లక్ష్యంతో అన్ని రాజకీయ పార్టీలు జాబితా ముందు వేసుకొని కుస్తీ పడుతున్నాయి.
Read Latest AP News And Telangana News And International News And Telugu News




