సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్లో దంపతులు నివాసం ఉండగా.. భర్తను భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటి వెంకటేశ్వర్లు అనే 62 ఏళ్ల వ్యక్తి.. ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీఓ)గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు.అయితే ఈ నెలాఖరులో వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ఇదే అంశంపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.వెంకటేశ్వర్లు, రాజమణి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజమణి ఇంట్లో ఉన్న రోకలిబండతో భర్త వెంకటేశ్వర్లు తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వెంకటేశ్వర్లును పరీక్షించిన డాక్టర్లు.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హనుమాన్ నగర్లోని నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లు తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రాజమణిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, ఆస్తి, రిటైర్మెంట్ డబ్బుల విషయంలో ఉన్న వివాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





