
కె.కోటపాడు: అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు.. స్వచ్ఛమైన ప్రాంతాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించిన సీఎం.. ప్రజావేదికలో మాట్లాడారు. సెప్టెంబరు తొలివారంలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మన ఊరు-మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని సూచించిన సీఎం.. స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమన్నారు. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత్ భారత్ వెలుగొందుతుందన్నారు. 2047కు తలసరి ఆదాయం రూ.50లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
‘‘విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయి. స్టీల్ సిటీ నిర్మాణం కాబోతోంది. డేటా సెంటర్లు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతోంది. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్.. సుందరమైన విశాఖకు వస్తోంది. మన అభివృద్ధిని చూసి వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోతే.. ఇక్కడుండే కొద్దిమంది మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకూ డేటా సెంటర్ ప్రారంభం కాలేదు.. అప్పుడే నీళ్లు ఇంకిపోయాయంటారు. తాగడానికి నీళ్లు లేవంటూ.. తప్పుడు ప్రచారం ప్రారంభించారు. డేటా సెంటర్ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉండబోతుంది. అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ నింపే బాధ్యత మాది. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. గత ఐదేళ్ల వైకాపా పాలనలో చెత్తమయం చేశారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు ఊపందుకున్నాయి. ప్రతి గ్రామానికి స్వచ్ఛరథాలను పంపుతున్నాం. ఇంటిపై సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఒక్క రూపాయి ఖర్చు ఉండదు’’ అని సీఎం అన్నారు. రాష్ట్రమంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





