
నెల్లూరు (నగర పాలక సంస్థ): నెల్లూరు గణేష్ ఘాట్‌లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు ఇరుగాలమ్మ ఆలయం సమీపంలోని గణేష్ ఘాట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో మంత్రి ఆనం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ.. రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులందరికీ మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రోజు నెల్లూరు నగరంలోని ప్రముఖ ఆలయాల నుంచి భక్తులు ప్రసాదాల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఈ నెల 18న వినాయక నిమజ్జనం రోజున వేద పండితులతో ప్రత్యేకంగా గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల్లో పలు రాష్ట్రాలకు చెందిన సుప్రసిద్ధ కళాకారులతో నాదస్వర కచేరీ, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నెల్లూరు గణేశ్‌ ఘాట్‌ అభివృద్ధి : ఎమ్మెల్యే కోటంరెడ్డి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దేవాదాయ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గణేశ్‌ ఘాట్ వద్ద వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నెల్లూరు గణేశ్‌ ఘాట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం కార్పొరేషన్‌ ద్వారా రూ.45 లక్షలు, నుడా ద్వారా రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. నెల్లూరు నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడేలా ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






