
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత భారత మహిళా క్రికెట్‌లో స్మృతి మంధాన (Smriti Mandhana) సూపర్ స్టార్. ఇటీవలే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ ఘనత సాధించింది. ప్రస్తుతం ఆసియా కప్‌ ఫైనల్‌ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మంధాన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. సదరు వ్యాఖ్యాత రాజ్‌ షమాని అడిగిన ప్రశ్నకు మంధాన కాస్త భావోద్వేగానికి గురైంది. తాను కేవలం క్రికెట్‌ గురించి మాత్రమే మాట్లాడతానని మంధాన వ్యాఖ్యానించిన వీడియో వైరల్‌గా మారింది.
షమాని: మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన రాత్రి ఏది?
కాసేపు ఆలోచించిన మంధాన స్పందిస్తూ .. ‘‘వరల్డ్ కప్‌ గురించి అనుకుంటా’ అని వ్యాఖ్యానించింది. ఆ వెంటనే భావోద్వేగానికి గురైంది. ‘‘నేను కేవలం క్రికెట్‌ గురించి మాత్రమే మాట్లాడతా’’ అని చెప్పిన ఆమె కొవిడ్‌ సమయం కూడా అత్యంత కఠినమైందిగా పేర్కొంది. గతంలో పలాశ్‌ ముచ్చల్‌తో పెళ్లి వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అర్ధంతరంగా రద్దు కావడంతో కొన్నాళ్లు ఆమె మానసికంగానూ ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆ ఘటనను గుర్తుకొచ్చి ఉంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
తన క్యారెక్టర్‌పై మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరూ నాకు అంత దగ్గరగా అనిపించరు. కానీ, నాకు చాలా కోపం వస్తుంది. అందుకే నాతో పెట్టుకోవద్దు అనే ధోరణితో ఉండేదాన్ని. నేను మీ దారికి అడ్డురానంత వరకూ.. నా దారికి అడ్డు రావద్దని కోరుకుంటా. నేనేమీ ప్రతీకారం తీర్చుకొనే వ్యక్తిని కాదు. అలాగని వెంటనే మరిచిపోను. ఎవరికీ చెడు మాత్రం చేయను. మనుషులను క్షమిస్తా కానీ... ఆ ఘటనను మరిచిపోను’’ అని మంధాన (Smriti Mandhana) తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






