PPF Interest Rate : లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ల గురించి ఆలోచిస్తుంటారు. ఇది మంచిదే. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఆశించొచ్చు. అయితే ఇక్కడ రిస్క్ ఉంటుంది. అదే రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసం మనం చాలానే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వీటిల్లో పీపీఎఫ్ అనే పోస్టాఫీస్ స్కీమ్‌కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. 1986లో దీనిని ప్రారంభించగా వడ్డీ రేట్లు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మెచ్యూరిటీకి మాత్రం సంపద పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ఇక్కడ కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అద్భుత రిటర్న్స్ వస్తుంటాయి. చాలా చిన్న మొత్తాల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ఇంకా ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే పెట్టుబడి సహా వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు.ఇందులో మెచ్యూరిటీకి వచ్చే డబ్బును పెళ్లి కోసమో, పిల్లల పైచదువుల కోసమో, ఇల్లు కొనుగోలు చేయడం వంటి కలల్ని సాకారం చేసుకోవడం లేదా రిటైర్మెంట్ ప్లానింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ అకౌంట్ ఈజీగా తెరవొచ్చు. ఒక అప్లికేషన్ ఫారం నింపి, ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్స్ కూడా ఇస్తే సరిపోతుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియెన్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు.ప్రస్తుతం వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 7.10 శాతంగా ఉంది. వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. అయితే చాలా కాలంగా వడ్డీ రేట్లను మార్చట్లేదు. ఈ స్కీంలో కనీసం వార్షికంగా రూ. 500 నుంచే పెట్టుబడులు ప్రారంభించొచ్చు. గరిష్ఠంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. దీనిని ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా గరిష్ఠంగా 12 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించొచ్చు. ఇక వరుసగా కనీసం 15 ఏళ్లు ఇందులో డబ్బుల్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.Read Also: జులై 31లోపే ఐటీఆర్ ఫైల్ చేశారా? అయినా ఈ 6 కారణాలతో నోటీసులు రావచ్చు తెలుసా?మెచ్యూరిటీ 15 ఏళ్లు అయినా తర్వాత కూడా కావాలంటే పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల బ్లాక్ చొప్పున ఎన్ని సార్లయినా పొడిగించుకునే వీలుంటుంది. అంటే 20, 25, 30, 35, 40 ఇలా ఎన్నేళ్లయినా కొనసాగించే వీలుంటుంది. అప్పుడే పుట్టిన పాప లేదా బాబు పేరిట అకౌంట్ తెరిచినా వారికి కనీసం 15 ఏళ్లు వచ్చే వరకు అకౌంట్ కొనసాగించాలి. తర్వాత కూడా కావాలంటే వారికి 30- 40 ఏళ్లు వచ్చే వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు.ఇప్పుడు ఉదాహరణకు నెలకు రూ. 5 వేలు లేదా ఏడాదికి రూ. 60 వేల చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే 7.10 శాతం వడ్డీ రేటు చొప్పున మెచ్యూరిటీకి రూ . 16.27 లక్షలు వస్తాయి. ఇక్కడ పెట్టుబడి రూ. 9 లక్షలుగా ఉంటుంది. దీనిని మరో ఐదేళ్లు కొనసాగిస్తే అంటే 20 ఏళ్లకు చేతికి రూ. 26.63 లక్షలొస్తాయి. ఇదే నెలకు రూ. 5 వేల చొప్పున జమ చేస్తే 30 ఏళ్లకు రూ. 61.80 లక్షలు వస్తాయి. పెట్టుబడి రూ. 18 లక్షలుగా ఉంది. ఇక గరిష్ఠ పెట్టుబడి అయిన ఏటా రూ. 1.50 లక్షలు వరుసగా 25 ఏళ్లు జమ చేస్తే రూ. కోటికిపైనే రాబడి వస్తుంది. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లుగా వారు పెట్టుబడులు పెట్టొచ్చు.