
సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి సంయుక్తంగా నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. మహేష్ చంద్రతో తనకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, ఆయన ఎంతో క్లారిటీ ఉన్న దర్శకుడని అన్నారు. కొత్త కంటెంట్, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తన పాత్రలో మంచి డెప్త్ ఉందని, మహేష్ చంద్ర ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఈ సినిమాలో ఉందని, ప్రతి ఇంట్లో జరిగే కథలా ఉంటుందని అన్నారు. క్లైమాక్స్‌లో అద్భుతమైన ఎమోషన్ ఉందని, అదే సమయంలో ఈ జనరేషన్‌కు నచ్చే అంశాలు కూడా సినిమాలో ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాలని ఆయన కోరారు.
దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మనసుతో పాటు ప్రాణం పెట్టి పనిచేశానని, మూవీ అద్భుతంగా వచ్చిందని అన్నారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
చిత్రబృందం తెలిపిన వివరాల ప్రకారం.. ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’లో తండ్రీకూతుళ్ల బంధం, కుటుంబ భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే అంశాలు కూడా సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.





