
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tirumala Temple: పరమ పవిత్ర క్షేత్రం తిరుమల ఆలయం సోషల్ మీడియా పిచ్చి ఉన్న వారికి అడ్డాగా మారింది. రీల్స్‌కు కేరాఫ్‌గా తిరుమల ఆలయ పరిసరాలు మారాయి. తిరుమల కొండపై రీల్స్ చేస్తూ కొందరు హల్చల్ చేస్తున్నారు. పవిత్రంగా.. భక్తిప్రపత్తులతో తిరుమల కొండపై ఉండాల్సి ఉండగా తమ వ్యూస్ కోసం రీల్స్ చేస్తున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరగ్గా తాజాగా తిరుమలలో మరోసారి రీల్స్ చేశారు. ఓ కుటుంబం తిరుమల కేంద్రంగా రీల్స్ చేయడం వివాదానికి దారి తీసింది.
శ్రీవారి దర్శనానికి వెళ్తూ దేవుడి పేరుతో ఓ జంట రీల్స్ చేసింది. సర్వదర్శనం క్యూలైన్లో రీల్స్ చేసినట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. అంతేకాకుండా రాంబగీచా వద్ద కూడా ఆ కుటుంబం రీల్స్ చేసింది. దర్శనానికి వచ్చే భక్తుల మధ్యే వీడియోల చిత్రీకరణ చేశారు. తిరుమలలో రీల్స్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రీల్స్ చేసిన వారిని కామెంట్ల రూపంలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వస్తున్నారా..? పబ్లిసిటీ కోసం వస్తున్నారా..? అంటూ నిలదీస్తున్నారు.
భక్తి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం కోసం రీల్స్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. లైక్స్, వ్యూస్ కోసం తిరుమలలోనే రీల్స్ చేస్తున్నారంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కావాలనే రీల్స్ చేసి వార్తల్లోకి వస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించవద్దంటూ భక్తులు వేడుకుంటున్నారు. దర్శన క్యూలైన్లలో ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించేలా రీల్స్ చేస్తుండడంతో తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమలలో రీల్స్ సంస్కృతిపై టీటీడీ మరింత కఠినంగా వ్యవహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తి వాతావరణం పెంపొందించేలా టీటీటీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి వద్ద చేపడుతున్న మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పుష్కరిణి వద్ద భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. పుష్కరిణి లోతు భక్తులకు స్పష్టంగా తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.





