
ఇంటర్నెట్ డెస్క్: నిషేధిత ఉత్పత్తులైన పాన్ మసాలాలకు పరోక్షంగా ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్‌గణ్ ( Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం-ఎఫ్‌డీఏ (Maharashtra FDA) షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఒక నిషేధిత ఉత్పత్తిని ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర స్థాయి ఆహార నియంత్రణ సంస్థకు చట్టపరమైన అధికారం ఉందా? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. మరి దీనికి చట్టం ఏం చెబుతోంది? సూపర్స్టార్లకు నోటీసులు జారీ చేసిన తుకారాం ముంఢే (Tukaram Mundhe) ఎవరు..?
ఇలాచీ పేరుతో ప్రసారమవుతోన్న ప్రకటనలో నటించినందుకు గానూ.. 2006 నాటి ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని 24, 53 సెక్షన్ల కింద ఎఫ్‌డీఏ.. ఈ సెలబ్రిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటన వల్ల నిషేధిత ఉత్పత్తికి పరోక్ష ప్రచారం జరుగుతోందా?అనేది తాము పరిశీలించనున్నామని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారం ముంఢే చెబుతున్నారు. ఈ ఉత్పత్తుల ప్రచారంలో మీ పాత్ర ఏమిటి? ప్రకటనకు ముందు ఉత్పత్తిపై, దాని చట్టబద్ధతపై ఎలాంటి పరిశీలన చేశారు? వంటి వాటిపై వివరణ ఇవ్వాలని నటులను ఎఫ్‌డీఏ ఆదేశించింది. తమ ఎండార్స్మెంట్ ఒప్పందాలు, క్యాంపెయిన్ వివరాలు, ఉత్పత్తి సమాచారం, చెల్లింపుల వివరాలు, ప్రకటన సంస్థ, బ్రాండ్ యజమాని తదితర సమాచారాన్ని సమర్పించాలని తెలిపింది. అలాగే, ఈ ప్రచార కంటెంట్‌ను తమ సోషల్ మీడియా ఛానెళ్ల నుంచి తొలగించాలని, తక్షణం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై లిఖిత పూర్వక వివరణ ఇచ్చేందుకు ఈ నటులకు 15 రోజుల గడువు కల్పించింది. ఇలాంటి కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం రూ.10లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది.
నిషేధిత ఉత్పత్తులకు పరోక్షంగా ప్రచారం చేశారన్న ఆరోపణలపై ప్రముఖులకు షోకాజ్ నోటీసులు జారీ చేసే చట్టపరమైన అధికారం మహారాష్ట్ర ఎఫ్‌డీఏకు ఉంది. అయితే, నేరుగా రూ.10లక్షల జరిమానా విధించే అవకాశం ఎఫ్‌డీఏకు లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం.. కనీసం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదా కలిగిన నిర్ణయాధికారి మాత్రమే ఈ జరిమానాను విధించగలరు. అంతేగాక, ఈ జరిమానా ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ అప్పిలేట్ ట్రైబ్యూనల్ ముందు సవాల్ చేసే అవకాశం సెలబ్రిటీలకు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగే, స్టార్లకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఈ ప్రచార కంటెంట్‌ను సోషల్ మీడియా ఖాతాల నుంచి తక్షణమే తొలగించాలని ఎఫ్‌డీఏ ఆదేశించింది. అయితే, ఈ అధికారం రాష్ట్ర ఆహార నియంత్రణ సంస్థకు లేదని న్యాయ నిపుణులు వెల్లడించారు. సదరు పోస్టులు తొలగించాలని కోరే హక్కు మాత్రమే ఎఫ్‌డీఏకు ఉందని, నేరుగా ఆదేశించే అధికారం లేదని పేర్కొన్నారు. పోస్టులను తొలగించే అంశం కేంద్ర వినియోగదారు రక్షణ సంస్థ (సీసీపీఏ) పరిధిలోకి వస్తుందని తెలిపారు. అందువల్ల ఈ నటులకు జారీ చేసిన వాటిని కేవలం షోకాజ్ నోటీసులుగానే పరిగణించాలని చెబుతున్నారు.
ఐఏఎస్ అధికారి తుకారాం ముంఢే.. మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ముంబయిలోని ప్రసిద్ధ హోటళ్లు, రెస్టారంట్లలో ఆయన చేపట్టిన తనిఖీలు, దాడులు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. తుకారాంను స్థానికంగా ట్రాన్స్ఫర్ కింగ్ అని పిలుస్తారు. 2005 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన.. రెండు దశాబ్దాలకుపైగా ఉన్న తన సర్వీసులో సుమారు 25 బదిలీలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే ఆయన ట్రాన్స్ఫర్ అవడం గమనార్హం. తుకారాం తన కెరీర్లో గ్రామీణ పరిపాలన నుంచి.. పట్టణ పాలన వరకూ అనేక కీలక పదవుల్లో పనిచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
.webp)




