
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Kamindu Mendis Two Hands Bowling: శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌లో ఉన్న అరుదైన టాలెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. రెండు చేతులతోనూ స్పిన్ బౌలింగ్ చేస్తూ.. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. కుడిచేత్తో 'ఆఫ్ స్పిన్' అలాగే ఎడమచేత్తో 'లెఫ్ట్ ఆర్మ్ స్పిన్' వేయగలడు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన రికార్డులు కల్గిన ఈ ఆల్‌రౌండర్.. భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో శ్రీలంక టీమ్‌కు కీలక ఆటగాడిగా మారనున్నాడు. గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక వైస్ కెప్టెన్‌గా కమిందు మెండిస్ ఉన్నాడు. ధనంజయ డి సిల్వా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఒకే ఓవర్లలో రెండు వేర్వేరు చేతులతో బౌలింగ్ చేయడం పూర్తి లీగల్. అయితే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏ చేతితో బౌలింగ్ చేయబోతున్నాడు..? వికెట్‌కు ఏ వైపు నుంచి వేస్తున్నాడు..? అనే విషయాన్ని ముందుగా అంపైర్‌కు చెప్పాలి. ఈ విషయాన్ని స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు అంపైర్ తెలియజేస్తారు. ఒకవేళ బౌలర్ అంపైర్‌కు చెప్పకుండా హఠాత్తుగా హ్యాండ్ ఛేంజ్ చేసి బౌలింగ్ చేస్తే.. అంపైర్ దానిని 'నో బాల్'గా ప్రకటిస్తారు. ఒక ఓవర్లో బౌలర్ ఎన్నిసార్లయినా చెయ్యి మార్చి బౌలింగ్ చేయవచ్చు. హ్యాండ్ మార్చిన ప్రతిసారీ అంపైర్‌కు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. గతంలో జరిగిన అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లలో రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేశాడు కమిందు మెండిస్.
పిచ్ పరిస్థితులను బట్టి బౌలింగ్ కోణాన్ని మార్చుకోవచ్చు. పిచ్‌పై ఉండే రఫ్ ప్యాచెస్‌ను ఉపయోగించుకుని వికెట్లు తీయవచ్చు. హఠాత్తుగా బౌలింగ్ స్టైల్ మార్చడం ద్వారా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టవచ్చు. బ్యాట్స్‌మెన్‌ను బట్టి.. బౌలింగ్‌లో వెంటనే మార్పులు చేసుకోవచ్చు. 1950ల కాలంలో పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ హనీఫ్ మహమ్మద్ టెస్టుల్లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన మొదటి బౌలర్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రహాం గూచ్ కూడా ఇలాగే రెండు చేతులతో బౌలింగ్ చేసేవారు. 1996 ప్రపంచకప్‌లో కెన్యాపై మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ఆటగాడు హసన్ తిలకరత్నే కూడా రెండు చేతులతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు.
కమిందు మెండిస్ మొదటి 8 టెస్టు మ్యాచుల్లోనూ వరుసగా అర్ధ సెంచరీలు (50+) చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన ఆసియా ఆటగాడిగా కూడా నిలిచాడు. మొత్తం 16 మ్యాచుల్లో 58.12 సగటుతో 1453 పరుగులు (5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు, అత్యధిక స్కోరు 182 నాటౌట్) చేశాడు. బౌలింగ్‌లో అలాగే 3 వికెట్లు తీశాడు. బౌలింగ్‌లో మెండిస్‌కు ఎక్కువ వికెట్లు లేకపోయినా.. ఒకే ఓవర్లో రెండు చేతులో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. భారత్‌కు కమిందు నుంచే ఎక్కువగా ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.