Hyderabad Petrol Price : అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఓసారి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు సహా వీటి టాక్స్ రేట్లను సవరిస్తోంది. చాలా వరకు రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోయినా మరోవైపు విండ్‌ఫాల్ టాక్స్ రేట్లను మాత్రం సవరిస్తూ వస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దీనిని కూడా పెంచడం లేదా తగ్గించడం చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆగస్ట్ 15న మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ గెయిన్స్ తగ్గించేసింది. దీనిని దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై విధిస్తుంది కేంద్రం. తాజాగా విండ్‌ఫాల్ టాక్స్ గెయిన్స్ తగ్గించడంతో విదేశాలకు ఇంధనం ఎగుమతి చేసి లాభాల్ని ఆర్జించే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి చమురు సంస్థలకు ప్రయోజనం అందనుంది. పూర్తి వివరాల్ని చూద్దాం.పెట్రోల్ ఎగుమతులపై నిన్నటి వరకు లీటరుపై విండ్‌ఫాల్ టాక్స్ రూ. 3.5 గా ఉండగా, దీనిని తాజాగా సున్నాకు పరిమితం చేసింది. అంటే ఇక్కడ విండ్‌ఫాల్ టాక్స్ మొత్తాన్ని తగ్గించింది. ఇదే సమయంలో డీజిల్‌పై లీటరుకు గతంలో రూ. 25.5 గా ఉండగా దీనిని స్వల్పంగా తగ్గించి ఇప్పుడు రూ. 24 కు పరిమితం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు విమాన ఇంధనంపై (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ లేదా జెట్ ఫ్యూయెల్) అంతకుముందు లీటరుపై విండ్‌ఫాల్ టాక్స్ రూ. 22 గా ఉంటే ఇప్పుడు రూ. 19.5 కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.అయితే ఇక్కడ విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించినంత మాత్రాన ఈ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఈ రేట్లు స్థిరంగానే ఉన్నాయి. ఆగస్ట్ 15న హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 గా ఉండగా, డీజిల్ రేటు లీటరు రూ. 103.82 పలుకుతోంది. ముడి చమురు ధరలు భారీగా దిగొస్తే తప్ప ఈ ఇంధన ధరలు తగ్గే అవకాశాలు కనిపించట్లేదు.విండ్‌ఫాల్ టాక్స్ విషయానికి వస్తే తొలిసారి 2022 జులై 1న కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పుడు రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో దేశీయంగా ఉన్న ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇక్కడ ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ సహా విమాన ఇంధనం, కిరోసిన్ వంటి ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేసి భారీగా లాభాల్ని ఆర్జించాయి. దీనిని నియంత్రించేందుకు, వాటి లాభాలకు అడ్డుకట్ట వేసేందుకు, దేశీయంగా చమురు లభ్యత పెంచేందుకు విండ్‌ఫాల్ టాక్స్ ప్రవేశపెట్టింది. తర్వాత ముడి చమురు ధరలకు అనుగుణంగా విండ్‌ఫాల్ టాక్స్ రేట్లన కూడా మారుస్తూ వచ్చేది.2024 చివర్లో ముడి చమురు ధరలు భారీగా దిగొచ్చి బ్యారెల్‌కు 60 డాలర్ల స్థాయికి పడిపోగా ఈ విధానాన్ని ఎత్తేసింది. అంటే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక విండ్‌ఫాల్ టాక్స్ ఏం లేదు. తర్వాత మళ్లీ అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలతో చమురు ధరలు మళ్లీ పెరగ్గా 2026 మార్చి సమయంలో మరోసారి తీసుకొచ్చింది. అప్పటినుంచి మళ్లీ 15 రోజులకు ఓసారి రేట్లను సవరిస్తూ వస్తోంది.





