రాష్ట్రంలో కూటమి సర్కార్ వరుసగా తాగు, సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. 30 ఏళ్లుగా పశ్చిమ ప్రకాశం వాసుల కలగా మిగిలిపోయిన వెలిగొండ ప్రాజెక్టును మొత్తానికి పూర్తి చేసి, కృష్ణమ్మ జలాలను నల్లమల సాగర్‌కు విడుదల చేసి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. వెలిగొండ పూర్తయిన వెంటనే ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో గోదావరి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును కూడా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తుని సమీపంలో నర్సీపట్నం రోడ్డును క్రాస్ చేస్తూ నిర్మించిన అక్విడెక్టు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. దాంతో దశాబ్దాలుగా ఉత్తరాంధ్రవాసుల కలగా మారిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తొలి అడుగు పడనున్నట్లయింది.READ ALSO కరువు సీమలో కృష్ణా జలాలు.. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన చంద్రబాబు!తుని - నర్సీపట్నం రహదారిపై నిర్మించిన అక్విడెక్టు గేట్లను ఎత్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తారు. ఇవి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. మొదటి దశలో 30 టీఎంసీల నీటిని అనకాపల్లి తరలిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి ఈ నీటిని ఎత్తిపోస్తారు.గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు విడుదల చేయడం వల్ల 110 చెరువులు నిండటమే కాకుండా, 148000 ఎకరాలకు సాగునీరు దక్కుతుంది. పోలవరం ఎడమ కాలువతో ఏలేరు నది అనుసంధానం కావడం వల్ల ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఫలితంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని 80,700 ఎకరాలు, పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.తాండవ, వరాహ, మావిడివాక గెడ్డ నదులు కూడా అనుసంధానం కావడంతో పాయకరావుపేట, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని చెరువులన్నీ నిండుతాయి. 46,620 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుతో మొత్తంగా అనకాపల్లి వరకూ గోదావరి జలాలు చేరడం ద్వారా 287320 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అలాగే 143 గ్రామాలకు చెందిన 4.23 లక్షల మందికి తాగునీరు అందుతుంది.





