
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక, మట్టి, మద్యం మాఫీయాలు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడిన స్థాయికి వ్యవస్థలు దిగజారాయి. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. 'రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు' అని ఆరోపించారు. అంత దారుణంగా పోలీసులు, అధికార పార్టీ (టీడీపీ) వారు కుమ్మక్కై పని చేస్తున్నారని విమర్శించారు.
'రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వివరించారు.




