
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Fake Currency: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్న సామెత నిజం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సామెత నిజం అవుతోందా…? అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే యూపీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత కలిగిన కరెన్సీ వాల్ట్ నుంచి రూ. 7.4 కోట్ల విలువైన అసలైన కరెన్సీని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో ఈ భారీ అక్రమం చోటుచేసుకుంది. అత్యంత భద్రత కలిగిన వాల్ట్ నుంచి సుమారు రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
రూ. 4.36 లక్షల వ్యత్యాసంతో బయటపడ్డ కుంభకోణం… పీఎన్బీ చీఫ్ డిప్యూటీ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10న బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిన నగదు రెమిటెన్స్‌లో రూ. 4.36 లక్షల కొరత కనిపించింది. ఈ తేడాపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించగా, కరెన్సీ వాల్ట్‌లో భారీ ఎత్తున నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నిషా సింగ్ మాట్లాడుతూ, విచారణ వేగవంతం చేశాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
'సిట్' ఏర్పాటు పీఎన్బీ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కుంభకోణంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్, కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ, అమిత్ కుమార్‌లను ప్రధాన అనుమానితులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరో ఘటనకు సంబంధించి హౌస్‌కీపర్ విశాల్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు.
ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సహారన్పూర్ డిఐజి అభిషేక్ ఆదేశాల మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని. సిట్ విచారణ చేపడుతోంది. నోట్ల లెక్కింపు పూర్తయ్యాక, దుర్వినియోగమైన మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుంటామని డిఐజి స్పష్టం చేశారు.
ఇన్సైడర్ల ప్రమేయంపై ఆరా అత్యంత భద్రత కలిగిన కరెన్సీ చెస్ట్‌లోకి నకిలీ నోట్లు ఎలా ప్రవేశించాయో తెలుసుకునేందుకు అధికారులు బ్యాంక్ లావాదేవీల రికార్డులు, ఆడిట్ లెడ్జర్లు, సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లోపలి వ్యక్తుల (ఇన్సైడర్స్) సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని అధికారులు అనుమానిస్తున్నారు. అసలు నోట్లను ఎప్పుడు మార్చారు, ఈ నకిలీ నోట్లు ఎన్ని రోజులుగా గుర్తింపునకు రాకుండా ఉన్నాయి, ఇందులో ఇంకా ఎంతమందికి ప్రమేయం ఉంది అనే కోణాల్లో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




