
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
AP Rural Drinking Water Citizen Charter 2026:గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాగునీటి సరఫరాలో సమస్యలు, పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ల రిపేర్లు వంటి సమస్యలకు ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు “రూరల్ డ్రింకింగ్ వాటర్ సిటిజన్ ఛార్టర్ 2026 (G.O. 829)”ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ కొత్త విధానం ప్రకారం ప్రజలు తమ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే దానికి కంప్యూటర్ రసీదు లేదా కంప్లైంట్ నంబర్ ఇవ్వాలి. దీంతో తమ ఫిర్యాదు నమోదు అయిందా లేదా అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉంటుంది. అలాగే సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
చిన్నపాటి నీటి సరఫరా సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించాలి. గ్రామాల్లో నీటి సరఫరాకు ఉపయోగించే మోటార్లలో సమస్య వస్తే దాన్ని 48 గంటల్లోపు రిపేర్ చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో మోటార్ సమస్యల కారణంగా ఎక్కువ రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది.
పైప్‌లైన్ లీకేజీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించింది. చిన్న లీకేజీలను 24 గంటల్లో, పెద్ద లీకేజీలను 72 గంటల్లోపు సరిచేయాలి. దీనివల్ల నీటి వృథాను తగ్గించడంతో పాటు ప్రజలకు నీటి సరఫరా త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.
నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు కూడా కొత్త మార్గదర్శకాలు ఉన్నాయి. అవసరం ఉన్న ప్రాంతాల్లో 24 గంటల్లోనే ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయాలి. ఒకవేళ నీరు కలుషితమైందని గుర్తిస్తే, 24 గంటల్లో క్లోరినేషన్ చేపట్టాలి. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇక ఇంటికి కొత్త కుళాయి కనెక్షన్ కావాలనుకునే వారికి కూడా ఈ విధానం ఉపయోగపడనుంది. అవసరమైన మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉంటే, 15 పనిదినాల్లోనే కొత్త ఇంటి కుళాయి కనెక్షన్ మంజూరు చేయాలి.
మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు వేగంగా పరిష్కారం అందించడమే ఈ కొత్త సిటిజన్ ఛార్టర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నిబంధనలు సక్రమంగా అమలైతే గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే నీటి సమస్యలకు త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




