
AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. చరిత్రలో మరిచిపోలేని రోజు!
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. ఈ నిర్ణయం బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుందని ఆమె పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఆయన స్ఫూర్తితో సీఎం చంద్రబాబు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. 1994లోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం పెరుగుతుందని అన్నారు.
బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీ అని సవిత పేర్కొన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి పలువురు బీసీ నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగారని తెలిపారు. బీసీలకు రాజకీయ గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించడంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత విధించిందని మంత్రి సవిత ఆరోపించారు. 34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 16,800కు పైగా పదవులకు బీసీలు దూరమయ్యారని విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని మంత్రి నారా లోకేశ్ తన పాదయాత్రలో గుర్తించి, అధికారంలోకి వస్తే 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుందని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంక్షేమం, ఆర్థిక భరోసా పెరిగిందని మంత్రి తెలిపారు. మొదటి బడ్జెట్లో రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్లో రూ.47 వేల కోట్లు, మూడో బడ్జెట్లో రూ.51 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, గీత కార్మికులకు మద్యం దుకాణాలు, బార్ల కేటాయింపుల్లో 10 శాతం, వడ్డెరలకు క్వారీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని వివరించారు.
చేనేత, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు తదితర వర్గాలకు కూడా వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. 15.67 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద రూ.15,588.64 కోట్లు చెల్లించామని, తల్లికి వందనం ద్వారా 10.46 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.1,360.61 కోట్లు అందించామని తెలిపారు.
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లతో బీసీలకు మరిన్ని రాజకీయ పదవులు దక్కనున్నాయని, తమను తాము పాలించుకునే అవకాశం కలుగుతుందని మంత్రి సవిత అన్నారు. బీసీలకు మరోసారి రాజకీయ పట్టం కడుతున్న కూటమి ప్రభుత్వ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు.
రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.




