ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 17,912 ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చింది.. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.447.80 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు కూడా జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు మంజూరు చేయనున్నాయి. ఈ రూ.2.50 లక్షల్లో.. కేంద్రం వాటా రూ.1.50 లక్షలు కాగా.. రాష్ట్రం వాటా కింద రూ.లక్ష ఇస్తారు. వీటితో పాటుగా వీబీ జీరామ్‌జీ (ఉపాధి హామీ పథకం) కింద రూ.27వేలు.. అలాగే స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు ఇస్తారు. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.89 లక్షలు అందుతాయి. కేంద్రం పీఎంఏవై-2.0 కింద పట్టణ పేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంది.. వీటిని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించనుంది.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఈ 17,912 ఇళ్లను జిల్లాల వారీగా కేటాయించింది. వీటిలో పట్టణ స్థానిక సంస్థ(యూఎల్బీ)ల పరిధిలో 15,793 ఇళ్లు ఉంటే.. పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల పరిధిలోకి మరో 2,119 ఇళ్లు వస్తాయి. ఈ 17,912 ఇళ్లలో అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 కేటాయించారు.. ఆ తర్వాత పల్నాడు జిల్లాకు (1,229), నెల్లూరు జిల్లాకు (1,057), కడప జిల్లాకు (1053) ఇళ్లు కేటాయించారు. రాష్ట్రంలో అత్యల్పంగా 212 ఇళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి జిల్లాల కలెక్టర్లు అనుమతులు ఇస్తారు.PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి కార్పెట్ ఏరియా కనీసం 30 చ.మీ., గరిష్ఠంగా 45 చ.మీ. ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు నమూనా డిజైన్లను లబ్ధిదారులకు అందుబాబులో ఉంచుతుంది. ఇళ్ల నిర్మాణం చేయబోయే స్థలంలో పరిస్థితులకు అనుగుణంగా ఇంటి డిజైన్‌ను లబ్ధిదారులు ఎంచుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లీలో జమ చేస్తారు. అంతేకాదు PMAY Gramin 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0) కింద త్వరలోనే ఏపీకి కేంద్రం 4 లక్షల ఇళ్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో PMAY కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి వారికి ఇళ్లు కేటాయిస్తోంది.




