
ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా స్థానికంగా గణనీయమైన పురోభివృద్ధి సాధించవచ్చని జీ.ఎమ్.ఆర్ గ్రూప్ పేర్కొంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భోగాపురం విమానాశ్రయ గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది.
విజయనగరం, ఆగస్టు 16: విమానాశ్రయం నిర్మిస్తే ఏమొస్తుందని చాలామంది భావిస్తుంటారని, కానీ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా సమాజంలో గణనీయమైన పురోభివృద్ధి సాధించవచ్చని జీ.ఎమ్.ఆర్ (GMR) గ్రూప్ పేర్కొంది. ఏబీఎన్ (ABN) ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, స్థానిక ప్రాంత అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై పలు కీలక విషయాలను వెల్లడించింది.
విమానాశ్రయాల ఏర్పాటుతో కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని జీ.ఎమ్.ఆర్ ప్రతినిధులు తెలిపారు. హోటల్, రవాణా, పర్యాటక, రియల్ ఎస్టేట్, ఐటీ వంటి రంగాలు పుంజుకోవడంతో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
భారతదేశంలో ప్రస్తుతం నైపుణ్యం కలిగిన మానవవనరుల లోటు (Skill Deficit) ఎక్కువగా ఉందని, దేశంలోని యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. 'జీ.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్' ద్వారా సామాజిక బాధ్యతగా ఇప్పటివరకు దాదాపు లక్ష మందికి పైగా యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ అందించినట్లు తెలిపారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి, వారికి వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. కార్పొరేట్ రంగానికి మనం ఇచ్చే విలువలు, సామాజిక స్పృహే మనల్ని మరింత వృద్ధిలోకి తీసుకువస్తాయని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
Read Latest AP News And Telangana News And International News And Telugu News

