
Veligonda Project.. మూడు దశాబ్దాలుగా ప్రకాశం, మార్కాపురం ప్రాంత ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న మహత్తర కలకు నేడు సాకారం లభించింది. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఏ చేతులతోనైతే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానో.. అదే చేతులతో మూడు దశాబ్దాల తర్వాత ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించి కృష్ణమ్మ జలాలను ప్రజలకు అందించడం తన జీవితంలో మర్చిపోలేని అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. నీటిలోకి దిగిన సీఎం.. పవిత్ర కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జలహారతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.
Veligonda Project చరిత్రలో ఈ రోజు ఒక కీలక ఘట్టంగా నిలిచింది. 30 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడే.. నేడు తొలి దశను ప్రారంభించడం ప్రత్యేకతను సంతరించుకుంది. శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు మారని పట్టుదల, ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పానికి ఈ కార్యక్రమం సజీవ సాక్ష్యంగా నిలిచింది.
దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత రైతులకు వెలిగొండ ప్రాజెక్ట్ ఒక ఆశాకిరణంగా మారింది. కరువు ప్రభావంతో సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు కృష్ణా జలాలు చేరడంతో వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కాలువలకు చేరుకున్నాయి. నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ జలాలు ముందుకు సాగి నల్లమల సాగర్‌లోకి చేరుతున్న దృశ్యం కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకుంది.
ఈ దృశ్యాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురు చూసిన రైతన్నల కష్టాలకు నేడు సమాధానం లభించిందని ఆయన పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్ కోసం భూములను త్యాగం చేసిన రైతుల పాత్రను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ భూములను త్యాగం చేసిన రైతుల చేతుల మీదుగానే వారి కలల ప్రాజెక్టును ప్రారంభించడం ప్రత్యేకమైన విషయంగా నిలిచింది.
నీటి కోసం తరతరాలుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు వెలిగొండ జలాలు కేవలం సాగునీరు మాత్రమే కాదని.. వారి భవిష్యత్తుకు భరోసా అని స్థానికులు భావిస్తున్నారు. కృష్ణా జలాలు అందుబాటులోకి రావడంతో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు.
జలహారతి కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్థానిక గిరిజన మహిళలు, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
సభా ప్రాంగణంలో సభికులకు అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు ర్యాంప్ వాక్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభికులు కండువాలను గాల్లో తిప్పుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారి నుంచి ఒక కండువాను తీసుకున్న సీఎం చంద్రబాబు కూడా దానిని గాల్లో తిప్పుతూ ప్రజలకు అభివాదం చేశారు.
వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలతో పాటు నీటి అవసరాలు ఉన్న మరికొన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలగనుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో సాగునీటి లభ్యత పెరగడంతో వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
“వెలిగొండ జలసిరులు – అభివృద్ధి రెక్కలు” అనే నినాదంతో ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభోత్సవం జరిగింది. నీటి లభ్యత పెరగడం ద్వారా రైతులకు సాగు భరోసా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయడం ద్వారా పశ్చిమ ప్రకాశం కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈస్ట్ గేట్మూడు దశాబ్దాల తర్వాత కల సాకారం
నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు
రైతుల త్యాగాలకు గుర్తింపుగా వెలిగొండ
గిరిజన మహిళల సంప్రదాయ నృత్యాలతో స్వాగతం
నాలుగు జిల్లాల ప్రజలకు ఆశాకిరణం
యుద్ధప్రాతిపదికన జంట సొరంగాల పనులు





