తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో రెండుసార్లు గరుడ సేవలు జరగనున్నాయి. ఆగస్టు 17వ తేదీ సోమవారం రోజు గరుడ పంచమి పర్వదినం వచ్చింది. గరుడ పంచమి సందర్భంగా తిరుమలలో ఆగస్ట్ 17వ తేదీ అంటే సోమవారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మలయప్పస్వామి తనకు ఇష్టమైన గరుడ వాహనంపై విహరిస్తారు. తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గరుడ పంచమి పర్వదినాన్ని తిరుమలలో ఏటా ఘనంగా నిర్వహిస్తారు. కొత్తగా పెళ్లైనవారు.. తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని., అలాగే స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలంగా, మంచి వ్యక్తిత్వంతో ఉండాలని కోరుకుంటూ గరుడపంచమి పూజలు చేస్తారని అర్చకులు చెప్తున్నారు.ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి గరుడ సేవమరోవైపు ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మలయప్పస్వామి గరుడవాహనంపై విహరిస్తారు. ఆగస్ట్ శనివారం రోజు రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలలోనే రెండుసార్లు గరుడ సేవ వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.అలిపిరి నడకమార్గంలో ధూమపానం..మరోవైపు అలిపిరి నడక మార్గంలో టీటీడీ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి ధూమపానం చేసిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం టీటీడీ దృష్టికి వచ్చింది. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నియమ నిబంధనల ప్రకారం తిరుమల పుణ్యక్షేత్రంతో పాటు, అలిపిరి, శ్రీవారి మెట్టు, టీటీడీకి చెందిన ఇతర ప్రాంతాల్లో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలను వాడటం పూర్తిగా నిషేధం.అయితే సదరు భక్తుడు ఈ విషయం తెలిసి కూడా.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అలిపిరి నడకమార్గంలో ధూమపానం చేయడాన్ని హేయమైన చర్యగా టీటీడీ పేర్కొంది. టీటీడీ నిబంధనలను అతిక్రమిస్తే.. అలాంటి వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తనిఖీలలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.





