
హైదరాబాద్: తనకు రాజకీయాల్లో సుదీర్ఘ భవిష్యత్ ఉందని మొదట గుర్తించింది దివంగత నేత రోశయ్యేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో తాను దూకుడుగా మాట్లాడుతుంటే ఆవేశం తగ్గించుకోవాలని ఆయన చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తన ఆవేశానికి ఆలోచన తోడైతే మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన సలహా ఇచ్చారని చెప్పారు. రోశయ్య ఎవరినైనా విమర్శిస్తారు కానీ దూషించరన్నారు.
హైదరాబాద్‎తోనే నా అనుబంధం ముడిపడి ఉందని రోశయ్య ఎప్పుడూ చెప్పేవారు.. అందుకే ఆయన విగ్రహాం హైదరాబాద్‎లో ఉండాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎంలు ఎంతమంది మారిన ఆర్ధిక శాఖ మంత్రిగా రోశయ్యనే ఉన్నారని.. ప్రభుత్వ సొమ్మును ఆయన పొదుపుగా వాడేవారని చెప్పారు. రోశయ్య దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని పేర్కొన్నారు.
ఆదివారం (సెప్టెంబర్ 13) హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‎లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో రెండే వృత్తులు ఉన్నాయని.. ఒకటి వ్యవసాయం.. రెండు వ్యాపారమని అన్నారు. వ్యాపారంలో మెలికలు తెలిసినోళ్లు ఆర్యవైశ్యులేనన్నారు.
ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం ఉన్నోళ్లని అన్నారు. పేదరికం ఉన్న ఆర్యవైశ్యులు కడుపులో దాచుకుంటారన్నారు. ఆర్యవైశ్యులు ఎంతో మంది పేదవారి ఆకలి తీరుస్తున్నారని కొనియాడారు. ఆర్యవైశ్యులు పేదలకు ఉదారంగా అప్పులు ఇస్తారన్నారు. ఆర్యవైశ్యులు ఆర్థిక క్రమశిక్షణ కలిగినవారని.. ఆర్థిక లావాదేవీల్లో సలహాల కోసం వారినే అడుగుతారన్నారు. ఆర్యవైశ్యుల బిడ్డ మహాత్మా గాంధీ అంటే ప్రపంచంలో తెలియనివారు లేరన్నారు. ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు కూడా ఆర్యవైశ్యుడేనని పేర్కొన్నారు.
ఆర్యవైశ్య సమాజం నుండి గొప్ప వ్యక్తులు దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించారని కొనియాడారు. ఆత్మగౌరవ భవనం పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఉపయోగపడాలన్నారు. భవన నిర్మాణ విషయంలో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు కలిసి ఉంటేనే మీకు బలం..అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‎లో ఆర్యవైశ్య బిడ్డను మున్సిపల్ చైర్మన్ చేశానని చెప్పారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు.
