
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Revanth Reddy: 'రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్‌ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. చెట్టుకు, పుట్టకు, రాయి, రప్పకు మొక్కుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తాము గ్రామగ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదని.. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
'అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం. బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 36 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. 95 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. 60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం' అని ముఖ్యమంత్రి వెల్లడించారు. 'యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం, క్రీడా అకాడమీని ప్రారంభించుకున్నాం' అని గుర్తుచేశారు.
'మేం చేసినవన్నీ చెబితే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రారు. చెబుతున్న అబద్ధాలను నమ్మడం లేదని కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరా రావు చేతబడి పూజలు చేయించి వచ్చాడు. కరువు రావాలని, రైతులు నష్టపోవాలని చేతబడి పూజలు చేస్తున్నారు. అధికారం కోసం ఇంతకు దిగజారుతారా?' అని అసహనం వ్యక్తం చేశారు. ఏది ఉన్నా మాట్లాడుకుని ముందుకు వెళ్దామని ప్రకటించారు.
'ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన తన కులం, కుటుంబం కోసం మాత్రమే పనిచేయలేదు. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. శివాజీ మాదిరి తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. బహుజనుల కోసం పాపన్న గౌడ్ తన జీవితాన్ని అంకితం చేయడంతోనే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది' అని వివరించారు.
'పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అందరిది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. 'మహేష్ గౌడ్ గాంధీభవన్‌లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను, భట్టి విక్రమార్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రిగా నేను మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాం. మళ్లీ అధికారాన్ని తీసుకువస్తాం. గౌడన్నలు నూటికి నూరు శాతం సహకరించాలి' అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చా' అని తెలిపారు.
'ప్రభుత్వ పొలాల్లో ఈత, తాటి చెట్లు నాటేలా చూస్తాం. కాలువ గట్లపైన కూడా ఈత, తాటి చెట్లు నాటాలి. పిల్లల తలరాతలను మనం మార్చవచ్చు. ఈనాడు చైతన్యం వచ్చింది. కులవృత్తిని కొనసాగించండి, గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి' అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా కేటాయిస్తామని.. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తామని ప్రకటించారు.





