
భువనగిరి-పోచంపల్లి: భారీ శబ్దాలతో రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రమాదం జరిగిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలోని హెజోలో రసాయన పరిశ్రమలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 మంది తీవ్రంగా గాయడపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో గ్రామస్థులు భయంతో ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి పరిశ్రమ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. పరిశ్రమ యాజమాన్యం ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో పదిమందికి పైగా ఉన్నారని పరిశ్రమలో పనిచేసే ఇతర కార్మికులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇదే పరిశ్రమలో మూడు నెలల్లోనే ఇది రెండో ప్రమాదం కావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. మృతుల్లో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన చెన్ను నాగిరెడ్డి (31), ఖమ్మం జిల్లా చౌడారం గ్రామానికి చెందిన నాగనబోయిన నరేష్కుమార్ (29) ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




