
పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడం కంటే, వారు చేసే పనులను గమనించి ఎక్కువగా నేర్చుకుంటారు. ముఖ్యంగా మగపిల్లలకు తండ్రి ఒక రోల్ మోడల్‌గా మారుతాడు. తండ్రి ఇతరులతో ఎలా మాట్లాడతాడు, కోపాన్ని ఎలా నియంత్రించుకుంటాడు వంటి విషయాలను పిల్లలు తెలియకుండానే గమనిస్తూ ఉంటారు. నిపుణుల ప్రకారం మగపిల్లలు తండ్రిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మగపిల్లవాడు తన తండ్రి ఇంట్లో అమ్మతో, అక్కాచెల్లెళ్లతో, బయటివారితో ఎలా మాట్లాడుతున్నాడో గమనిస్తాడు. తండ్రి తనకంటే చిన్నవారిని కూడా గౌరవంగా పలకరిస్తే, వారి మాటలను మధ్యలో అడ్డుకోకుండా వింటే, మహిళలను గౌరవంగా చూస్తే పిల్లవాడు కూడా అదే ప్రవర్తనను నేర్చుకుంటాడు. “అందరినీ గౌరవించాలి” అని తండ్రి చెప్పడం కంటే, తానే గౌరవంగా ప్రవర్తించడం పిల్లలకు మరింత బలమైన సందేశాన్ని ఇస్తుంది.
కోపం రావడం సహజం. కానీ కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేది పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. చిన్న సమస్యకే తండ్రి అరవడం, వస్తువులు విసరడం లేదా ఇతరులను అవమానించడం వంటివి చేస్తే, కోపం వచ్చినప్పుడు అలా ప్రవర్తించడం సహజమేనని పిల్లవాడు భావించే అవకాశం ఉంది. అదే తండ్రి కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉండి, నీళ్లు తాగి, పరిస్థితి ప్రశాంతమైన తర్వాత మాట్లాడితే అది పిల్లవాడికి మంచి పాఠం అవుతుంది.
ఇంటి బాధ్యతలు కేవలం తల్లి లేదా కుటుంబంలోని ఒకరి పని కాదని పిల్లలు తండ్రి ప్రవర్తన ద్వారా నేర్చుకోవచ్చు. తన వస్తువులను తానే సర్దుకోవడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, కుటుంబ అవసరాల కోసం బాధ్యతగా వ్యవహరించడం వంటి చిన్న విషయాలు పిల్లలకు గొప్ప పాఠాలుగా మారతాయి.
పిల్లలకు పరీక్షల్లో తక్కువ మార్కులు రావచ్చు, ఆటలో ఓడిపోవచ్చు, కోరుకున్న అవకాశం రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో తండ్రి ఎలా స్పందిస్తాడో పిల్లవాడు గమనిస్తాడు. తండ్రి స్పందన ఓటమిని అవమానంగా కాకుండా నేర్చుకునే అవకాశంగా చూసేలా చేయాలి. అలాగే పిల్లవాడు తప్పు చేసినప్పుడు వెంటనే విమర్శించకుండా, సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం గురించి మాట్లాడటం అతని ఆత్మవిశ్వాసానికి సహాయపడుతుంది.
తండ్రి తన పిల్లవాడిని ప్రేమగా కౌగిలించుకోవడం, వారి బాధలు ఓపికగా వినడం వంటి చిన్న విషయాలు అతనికి భావాలను వ్యక్తపరచడం సహజమేనని నేర్పుతాయి. తండ్రి తన తప్పులకు పిల్లల దగ్గర క్షమాపణ చెప్పగలిగితే, తప్పు ఒప్పుకోవడం బలహీనత కాదని పిల్లవాడు తెలుసుకుంటాడు.





