
Subash chandra | ఇంటర్నెట్‌డెస్క్: ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. రూ.22,006 కోట్ల క్లెయిమ్నకు గానూ రూ.6.25 కోట్లు మాత్రమే చెల్లించేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అనుమతించడంపై రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెల్లింపు విషయంలో త్రిసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును ఎన్సీఎల్టీ నిలిపివేసింది.
సుభాష్ చంద్రపై దాఖలైన వ్యక్తిగత దివాలా ప్రక్రియలో భాగంగా క్రెడిటర్లంతా కలిసి రూ.22,006.57 కోట్లు క్లెయిమ్ చేయగా.. కేవలం రూ.6.25 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు ఇటీవల ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికకు 80.81 శాతం క్రెడిటర్ల నుంచి ఆమోదం లభించడం గమనార్హం. అయితే, ఇందులో సుభాష్ చంద్ర కుటుంబంతో సంబంధం ఉన్న 5 సంస్థలు రుణదాతల కమిటీలో 61.78 శాతం ఓటింగ్ వాటాను కలిగి ఉన్నాయని, ఈ ప్రణాళిక ఆమోదించడంలో కీలక పాత్ర పోషించాయని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రుణ చెల్లింపు ప్రణాళికపై నిర్ణయం తీసుకోవడానికి అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఎన్సీఎల్టీ ఏర్పాటు చేసింది. ఈ రోజు విచారణ జరిగింది. ఈ క్రమంలో త్రిసభ్య తీర్పును నిలిపివేయడంతో పాటు ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్న ఆస్తులను ఎవరికీ బదిలీ చేయకూడదని ఆదేశించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





