
ఈ రోజుల్లో ఆఫీస్ పనులే కాదు, చాలామంది ఇంటి నుంచి కూడా ల్యాప్‌టాప్‌లపై గంటల తరబడి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చొని, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కిందకు చూస్తూ ఉండటం మెడ, వెన్ను భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కేవలం ల్యాప్‌టాప్ వాడటం వల్లే వెన్నెముక దెబ్బతింటుందని కాదు… స్క్రీన్ ఎత్తు, కూర్చునే విధానం, ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం, విరామం లేకుండా పనిచేయడం వంటివే ప్రధాన కారణాలు.
ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారికి మొదట్లో పెద్ద సమస్యగా కాకుండా కొన్ని చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మెడ పట్టేయడం, భుజాల నొప్పి, వీపు పైభాగంలో అసౌకర్యం, తలనొప్పి, పని పూర్తయ్యాక అలసటగా అనిపించడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ లక్షణాలను పట్టించుకోరు కొందరు. అలా అయితే రోజువారీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి.
ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారు కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా మెడ, వెన్నుపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కళ్ల ఎత్తుకు దగ్గరగా ఉండేలా పైకి లేపండి.
ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తే, వేరే కీబోర్డ్, మౌస్ వాడండి.
వెన్నెముకకు తగిన సపోర్ట్ ఉండేలా కూర్చోండి.
ఒకే భంగిమలో కాకుండా అప్పుడప్పుడు పొజిషన్ మార్చండి.
ఎక్కువసేపు పనిచేసేటప్పుడు మధ్యలో చిన్న విరామాలు తీసుకుని శరీరాన్ని కదిలించండి.
స్క్రీన్‌ను చూడటానికి ముందుకు వంగడం తగ్గించండి.
ఎక్కువసేపు పనిచేసిన తర్వాత మెడ కొద్దిగా పట్టేయడం సాధారణమే. కానీ, నొప్పి తగ్గకుండా పెరుగుతున్నా, చేతుల్లో తిమ్మిర్లు, చేతులు బలహీనపడటం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని వాడే పద్ధతిని మార్చుకోవడం ముఖ్యం. స్క్రీన్‌ను సరైన ఎత్తులో ఉంచడం, వెన్నెముకకు సపోర్ట్ ఇవ్వడం, బయటి కీబోర్డ్, మౌస్ వాడటం, మధ్యమధ్యలో లేచి నడవడం వంటి చిన్న అలవాట్లు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు శారీరక శ్రమను తగ్గించడంలో సహాయపడతాయి.





