తెలంగాణ వాణిజ్య పన్నుల ఆదాయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో నమోదైన జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 69 శాతం మంది హైదరాబాద్లోనే ఉన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర మొత్తం జీఎస్టీ వసూళ్లలో నగరం ఏకంగా 91.1 శాతం వాటాను నమోదు చేసింది. హైదరాబాద్లో ఆగస్టు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 20.53 శాతం పెరిగి రూ.3,956 కోట్లకు చేరాయి. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో సుమారు 5.8 లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు నమోదై ఉన్నారు. వీరిలో దాదాపు 4 లక్షల మంది హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి 10 మంది నమోదిత జీఎస్టీ చెల్లింపుదారుల్లో ఏడుగురు నగరానికి చెందినవారే. ఆగస్టులో తెలంగాణ మొత్తం రూ.4,341 కోట్ల జీఎస్టీ ఆదాయం సాధించగా.. అందులో హైదరాబాద్ నుంచే రూ.3,956 కోట్లు సమకూరాయి.పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం గణనీయంగా అధికంగా ఉండటానికి నగరంలో అధిక విలువ కలిగిన ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్, ఔషధ, రియల్ ఎస్టేట్ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో పెద్ద మొత్తంలో పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఒక్కో నమోదిత పన్ను చెల్లింపుదారుపై సగటు జీఎస్టీ వసూళ్లు సుమారు రూ.98,900గా ఉండగా.. రాష్ట్ర సగటు రూ.74,845గా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో తెలంగాణ పరోక్ష పన్నుల ఆదాయం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ, వ్యాట్ కలిపి రూ.36,636 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.31,477 కోట్లతో పోలిస్తే ఇది 16.39 శాతం అధికం. అంటే ఈ ఐదు నెలల్లో అదనంగా రూ.5,159 కోట్ల ఆదాయం సమకూరింది.ఏప్రిల్-ఆగస్టు 2025లో రూ.17,414 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.. 2026లో రూ.20,862 కోట్లకు పెరిగాయి. 19.80 శాతం వృద్ధితో రూ.3,448 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. వ్యాట్ వసూళ్లు కూడా రూ.14,063 కోట్ల నుంచి రూ.15,774 కోట్లకు పెరిగి 12.16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఆగస్టులోనూ జీఎస్టీ వసూళ్లు రూ.3,641 కోట్ల నుంచి రూ.4,341 కోట్లకు పెరగగా, వ్యాట్ ఆదాయం రూ.2,712 కోట్ల నుంచి రూ.3,193 కోట్లకు చేరింది. జీఎస్టీ, వ్యాట్ కలిపి నెలవారీ ఆదాయం రూ.7,534 కోట్లకు చేరింది.





