
రాయదుర్గం, న్యూస్‌టుడే: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో యువతి మృతి చెందిన ఘటనలో సంజుష్‌పై మాదాపూర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన భారతిముఖి (26) మాదాపూర్ పర్వత్‌నగర్‌లో ఉంటూ ఇనార్బిట్ మాల్లోని ఓ షోరూంలో సేల్స్ గర్ల్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 16న మధ్యాహ్న సమయంలో ఆమె షోరూం నుంచి సహోద్యోగిని పూజతో కలిసి భోజనం కోసం ఐటీసీ కోహినూర్ సమీపంలోని ఫుడ్ కోర్టుల వద్దకు వెళ్లారు. భోజనాలయ్యాక ఇద్దరూ తిరిగి వస్తూ.. రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు నుంచి వస్తున్న కారు.. భారతిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను.. అదే కారులో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె పని చేస్తున్న షోరూం మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంజుష్ కారు నడిపినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





