
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం టీమ్ఇండియాకు ఇబ్బందికరంగా మారింది. అయితే, గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) భారత జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్ కాగలడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ (Farveez Maharoof) అభిప్రాయపడ్డాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అకిబ్ నబీ, గుర్నూర్లతో కూడిన పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడు. తుది జట్టులో గుర్నూర్‌కు చోటు దక్కుతుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
‘‘బుమ్రాకు రివర్స్ స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ముఖ్యంగా పాత బంతితో అద్భుతంగా రివర్స్ స్వింగ్ రాబడతాడు. అతను లేకపోవడం భారత్‌కు పెద్దలోటు కానుంది. సిరాజ్ (Mohammed Siraj) మంచి బౌలరే. కానీ బుమ్రాతో పోల్చి చూసినప్పుడు మాత్రం కొంత తేడా కనిపిస్తుంది. వార్మప్ మ్యాచ్‌లో గుర్నూర్ బ్రార్ బౌలింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది. అతను టీమ్ఇండియాకు ఎక్స్-ఫ్యాక్టర్ అవుతాడని అనుకుంటున్నా. అతని బౌలింగ్‌లో మంచి వేగం, బౌన్స్ ఉన్నాయి. గుర్నూర్లో పోరాట పటిమ ఉంది. అవసరమైతే దూకుడును ప్రదర్శించగలడు.
నేను గనుక భారత జట్టు వ్యూహకర్తల బృందంలో ఉండి ఉంటే గుర్నూర్‌కు కచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలనుకునేవాడిని. అతను భారత్ తరపున కేవలం వైట్‌బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడని నాకు తెలుసు. కానీ, అతని బౌలింగ్‌లో ప్రత్యేకత ఉంది. బ్యాటర్ లయను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతను వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారగలవు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లకుతోడుగా మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్‌ను తీసుకునే అవకాశముంది. రిషభ్ పంత్ విషయంలో శ్రీలంక జాగ్రత్తగా ఉండాలి’’ అని ఫర్వేజ్ మహరూఫ్ సూచించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





