
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. ఓ మహిళా రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'క్వైట్, క్వైట్.. నువ్వు ఫేక్ న్యూస్' అంటూ నిప్పులు చెరిగారు. సోమవారం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఓ యువకుడిని సత్కరించే కార్యక్రమంలో భాగంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో సీఎన్ఎన్ ప్రతినిధి క్రిస్టెన్ హోమ్స్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా చేసే సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని కిమ్ ఏమైనా కోరారా? అని ఆమె ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ట్రంప్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. "క్వైట్, క్వైట్, క్వైట్. ఈ యువకుడి ముందు చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఏ సంస్థ?" అని ప్రశ్నించారు. ఆమె సీఎన్ఎన్ అని చెప్పగానే, "ఫేక్ న్యూస్. నువ్వు ఒక ఫేక్ రిపోర్టర్. గట్టిగా అరుస్తావు. నిశ్శబ్దంగా ఉండు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె మళ్లీ ప్రశ్న అడగడానికి ప్రయత్నించినా, ట్రంప్ ఆమెను అడ్డుకుంటూ మాట్లాడనీయలేదు.కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన తన పట్ల గౌరవంగా ప్రవర్తించారని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. సైనిక విన్యాసాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయనే ఉద్దేశంతోనే వాటిని తగ్గించామని, ఈ నిర్ణయం కొరియా ద్వీపకల్పాన్ని సురక్షితంగా మారుస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు



