
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
CM Revanth Independence Day 2026 Speech: జై తెలంగాణ' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ అహింసా మార్గం, జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య పోరాటాలను, మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశంలో జరిగిన హరిత, శ్వేత, నీలి విప్లవాల అభివృద్ధిని ప్రస్తావించారు. గత 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేస్తూ సంక్షేమ పథకాలను విస్తరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే 91 శాతం ఉందనే సానుకూల అంశాన్ని వెల్లడించారు.
వ్యవసాయ రంగం.. రైతుల సంక్షేమం.. రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. యాసంగిలో 8,500 కొనుగోలు కేంద్రాల ద్వారా 81,12,000 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వ్యవసాయంలో తెలంగాణ పంజాబ్‌ను మించిందని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళా సాధికారత.. సంక్షేమ పథకాలు.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతిరోజూ 34 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీ, శిల్పారామం వేదికలుగా కల్పిస్తున్నామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డులు.. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నామని వెల్లడించారు. తొలి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఉచిత సాయం అందిస్తున్నామని తెలిపారు ఇందులో గిరిజనులు, వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులు శంకుస్థాపన చేశామని చెప్పారు.
సామాజిక భద్రత... డిసెంబర్ 2023 నుండి జూలై 2026 వరకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులకు రూ. 30,890 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మరో 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సామాజిక న్యాయం.. దేశంలోనే తొలిసారిగా 59 ఎస్సీ ఉపకులాలను మూడు వర్గాలుగా విభజించి ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేయడానికి ఇది ప్రేరణగా నిలిచిందన్నారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచేందుకు అవసరమైన ఆమోదం కోసం కేంద్రానికి బిల్లు పంపామన్నారు.
వేతనాల పెంపు.. ఉద్యోగుల బాధ్యత చట్టం.. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను ఆమోదించి, నైపుణ్యం లేని కార్మికులకు రూ. 15,000, స్కిల్డ్ కార్మికులకు రూ. 17,500, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ. 25,000 వరకు వేతనాలు పెంచామన్నారు. గిగ్ కార్మికులకు చట్టబద్ధమైన గుర్తింపు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రతను తీసుకొచ్చారు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతంలో 15% కోత విధించి, నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా నూతన చట్టం అమలులోకి తెచ్చామన్నారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు.. దేశ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో తెలంగాణ విద్యారంగం 28వ స్థానం నుండి 18వ స్థానానికి చేరుకుంది. 105 ప్రపంచ స్థాయి ప్రమాణాల పాఠశాలల్లో ఇప్పటికే 84 మంజూరు చేశామని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 212% పెంచాం. 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ. 1,000 కోట్లు కేటాయించామన్నారు.
ఉద్యోగాల భర్తీ.. క్రీడా రంగం.. 72 వేలపైగా ఉద్యోగాలు మెగా డీఎస్సీ, గ్రూప్-1, 3, 4, పోలీస్ శాఖల్లో నియామకాలు పూర్తి చేసామన్నారు. యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. క్రీడలపరంగా ప్రోత్సహించడానికి గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేశామని, త్వరలో తెలంగాణ వేదికగా 'ఖేలో ఇండియా' నిర్వహిస్తున్నామని చెప్పారు.
వైద్యం.. ప్రజా ఆరోగ్యం తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత వైద్య పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచాం. నూతన ఆసుపత్రులు గోషామహల్ (ఓయూ ఆసుపత్రి), సనత్ నగర్లలో కొత్తగా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు చేపడుతున్నారు. కల్తీపై ఉక్కుపాదం TG-SAFE వేదిక ద్వారా ఆహార కల్తీ, డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
శాంతిభద్రతలు... ఔటర్ రింగ్ రోడ్లపై ప్రమాదాలు తగ్గించేందుకు 'ఈజీ ట్రాఫిక్' విధానం, మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా కేంద్రాలు బలోపేతం చేశామన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగుల జీతాలు ఇస్తున్నామని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు జమ చేశామని సీఎం వెల్లడించారు.
సుపరిపాలన.. మౌలిక వసతుల కల్పన... డిజిటల్ తెలంగాణలో భాగంగా 100 శాతం ఈ-ఆఫీస్ అమలు, డిజిటల్ క్యాబినెట్ ,వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు, 7 కారిడార్లతో మెట్రో రెండో దశ పనులు త్వరలోనే చేపడతామన్నారు. వరంగల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.
మూసీ ప్రక్షాళన.. ఆక్రమణల నుండి చెరువులు, నాళాలను కాపాడేందుకు 'హైడ్రా' తెచ్చామని.. గోదావరి నీటితో మూసీ నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి.. పెట్టుబడులు.. TG-iPASS ద్వారా పెట్టుబడులు వచ్చాయని, 2025లో రూ. 5.75 లక్షల కోట్ల అంచనా విలువైన MoUలు కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల సంఖ్య 12 లక్షలు దాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. హైదరాబాద్‌లో 350+ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఉండగా, అమెజాన్ రూ. 7 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడికి ముందుకు వచ్చిందని సీఎం పేర్కొన్నారు.
టూరిజం.. గోదావరి పుష్కరాలు.. తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తూ కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
'తెలంగాణ రైజింగ్ 2047' లక్ష్యం.. 'తెలంగాణ రైజింగ్ 2047' దిశగా అడుగులు వేస్తూ, రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుండి 10 శాతానికి పెంచాలని సంకల్పించినట్లు సీఎం తెలిపారు. ఇక మానవ సంకల్పానికి దైవబలం తోడైతే విజయం ఖాయమని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి 'జై హింద్, జై తెలంగాణ' నినాదంతో ప్రసంగాన్ని ముగించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





