
ఇంటర్నెట్ డెస్క్: సొంత మైదానంలో బంగ్లాదేశ్‌ను కట్టడి చేద్దామని భావించిన ఆస్ట్రేలియా (Australia vs Bangladesh) చివరికి కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. బౌలింగ్‌లోనూ విఫలమై నిరాశపరిచింది. తన్జిద్ హసన్ (101) సెంచరీ, నజ్ముల్ షాంటో (84), మెహిదీ హసన్ మిరాజ్ (65) అర్ధశతకాలు సాధించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 161/4. ఇంకా 67 పరుగులు వెనుకబడే ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో కామెరూన్ గ్రీన్ (43*), అలెక్స్ కేరీ (19*) ఉన్నారు.
బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. 228 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా అప్పుడే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. జేక్ వెదర్లాండ్ (0) డకౌట్ కాగా.. ట్రావిస్ హెడ్ (17), మార్నస్ లబుషేన్ (31), స్టీవ్ స్మిత్ (44) పరుగులు చేశారు. హసన్ మహ్ముద్ 2.. తైజుల్ ఇస్లామ్, మెహిదీ చెరో వికెట్ తీశారు.
ఓవర్‌నైట్ 351/6 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా 400 పరుగులు దాటడంలో మెహిదీ హసన్ కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ (6/89) కాస్త ప్రభావం చూపించాడు. బంగ్లాపై ఫైఫర్ తీసిన తొలి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆసీస్ తరఫున 300 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గానూ హేజిల్‌వుడ్ నిలిచాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 301 వికెట్లు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



