
హైకోర్టులో విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పిల్ విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ భద్రతను మదింపు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేసేలా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ను ఆదేశించాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా ఓ న్యాయవాది స్పందిస్తూ, ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా వాదనలు వినిపిస్తారని చెప్పారు. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్ష రాస్తున్నారని, కాసేపు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇది ఈరోజే విచారణ జరపాల్సినంత అత్యవసరమైన వ్యవహారం కాదని ధర్మాసనం పేర్కొని, విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ‘గ్యాప్-1, గ్యాప్-2 డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాదులు, డిజైన్ విషయంలో ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించేలా ఆదేశించండి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి క్వాలిటీ కంట్రోల్, తదితర రికార్డులను సీడబ్ల్యూసీ ముందు ఉంచేలా ఆదేశించండి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చెందిన ప్లానింగ్, డిజైన్ చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్, మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ, బ్యూరో ఇంజినీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, ఏఎఫ్ఆర్వై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ, సెంట్రల్ సాయిల్, మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, వాటర్, పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సీఎండీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

