
వినాయక చవితి పూజకు ఈ మధ్య చాలామంది మట్టి విగ్రహాల్నే ఎంచుకుంటున్నారు. అయితే ఈ గొప్ప పనిలో ప్రతి ఒక్కరూ భాగమైనప్పుడే పర్యావరణానికి మేలు జరుగుతుందంటోంది 17 ఏళ్ల క్రిష తోష్నీవాల్. దీన్ని ప్రోత్సహించడానికే గత ఆరేళ్లుగా ‘విత్తన గణపతి’ విగ్రహాల్ని తయారుచేస్తోంది.
వినాయక చవితి పూజకు ఈ మధ్య చాలామంది మట్టి విగ్రహాల్నే ఎంచుకుంటున్నారు. అయితే ఈ గొప్ప పనిలో ప్రతి ఒక్కరూ భాగమైనప్పుడే పర్యావరణానికి మేలు జరుగుతుందంటోంది 17 ఏళ్ల క్రిష తోష్నీవాల్‌. దీన్ని ప్రోత్సహించడానికే గత ఆరేళ్లుగా ‘విత్తన గణపతి’ విగ్రహాల్ని తయారుచేస్తోంది. వాటిని దేశవిదేశాలకు ఎగుమతి చేస్తూ అందరిలో పర్యావరణ స్పృహ పెంచుతోంది. ఇలా చిన్న వయసులోనే తన ఎకో-ఫ్రెండ్లీ వ్యాపారంతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష గురించి తెలుసుకుందాం..
క్రిషది చెన్నై. చిన్న వయసు నుంచే తల్లిదండ్రుల స్ఫూర్తి, ప్రోత్సాహంతో పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువ చూపిన ఆమె.. స్కూల్లో నిర్వహించే పలు పర్యావరణహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. అయితే తనకు 11 ఏళ్లున్నప్పుడు ఓసారి వినాయక నిమజ్జనం చూడ్డానికి దగ్గర్లోని నదీ తీరానికి వెళ్లింది. అక్కడే ఎకో-ఫ్రెండ్లీ విగ్రహాలు తయారుచేయాలన్న ఆలోచన వచ్చిందంటోంది క్రిష.
‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల వల్ల నీరు, పర్యావరణం ఎంతగా కలుషితమవుతున్నాయో మా నాన్న చెబితే విని ఆశ్చర్యపోయా. వీటి తయారీలో వాడే హానికారక రసాయనాలు జలచరాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్న విషయం నన్ను ఆలోచనలో పడేసింది. అప్పుడనిపించింది.. మట్టి విగ్రహాలు తయారుచేసి అందరినీ ఈ దిశగా ప్రోత్సహించాలని. ఈ ఆలోచనతోనే ఆరేళ్ల క్రితం ‘ఎకో-ఫ్రెండ్లీ గణేషా’ పేరుతో పర్యావరణహిత గణపతి విగ్రహాల తయారీ ప్రారంభించా..’ అంటోన్న క్రిష.. బంకమట్టి, సహజ రంగులతో వినాయక విగ్రహాలు తయారుచేస్తోంది. అలాగే వివిధ రకాల కాయగూరల విత్తనాల్ని ఈ విగ్రహాల్లో అమర్చుతోంది.
ఇలా విత్తన గణేషుడి విగ్రహాలు తయారుచేస్తూ.. పర్యావరణహితంగా పండగ జరుపుకొనేలా అందరినీ ప్రోత్సహిస్తోంది క్రిష. వీటి తయారీలో సేలంకు చెందిన కొందరు కళాకారుల్నీ భాగం చేస్తోంది. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తోంది.
‘మా వద్ద తయారయ్యే విత్తన వినాయక విగ్రహాలు దేశవ్యాప్తంగా వివిధ నగరాలకే కాదు.. దుబాయ్‌కి కూడా పంపిస్తున్నాం. అలా ఈ ఆరేళ్లలో కొన్ని వందల విగ్రహాలు మొక్కలుగా రూపాంతరం చెందాయి. అయితే వీటిని అమ్మగా వచ్చిన డబ్బును అవయవ దానంపై అవగాహన కల్పిస్తోన్న ఇక్కడి ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందిస్తున్నా..’ అంటోన్న క్రిష.. మరోవైపు పేద విద్యార్థులకు అవసరమైన స్కూల్‌ కిట్లను అందించడానికి నిధులు కూడా సమకూర్చుతుంటుంది. ఇలా ఓవైపు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే.. మరోవైపు సమాజ సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు తెచ్చుకుంది.
⚛ ప్రస్తుతం చెన్నైలోని కేసీ హైస్కూల్‌లో ప్లస్‌ టూ చదువుతోన్న క్రిష.. గతంలో ముంబయిలో ‘హార్వర్డ్‌-యూత్‌ లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్‌’ ప్రోగ్రామ్‌ను పూర్తిచేసింది.
⚛ స్వతహాగా క్రీడలంటే మక్కువ చూపే ఆమె.. టెన్నిస్‌ క్రీడను మరింతగా ఇష్టపడతానంటోంది. ‘జాతీయ స్థాయిలో జరిగిన పలు టెన్నిస్‌ పోటీల్లో పాల్గొన్నా. భవిష్యత్తులో ఐటీఎఫ్‌ పోటీల్లో సత్తా చాటేందుకూ సిద్ధపడుతున్నా. ఈ క్రీడ నన్ను అథ్లెట్‌గా మార్చడమే కాదు.. వ్యక్తిగతంగానూ ఎంతో ఉపయోగపడింది..’ అంటోంది క్రిష.
⚛ సంగీతమన్నా మక్కువ చూపే క్రిష.. ‘ట్రినిటీ గ్రేడ్‌-3 మ్యూజిక్‌ థియరీ’ కోర్సు పూర్తి చేసి దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా అందుకుంది. పియానో వాయించడంలోనూ ఆమె నిపుణురాలు.
⚛ సాహసాలు చేయడమన్నా క్రిషకు చాలా ఇష్టమట. ఇప్పటికే స్కై డైవింగ్‌, పారాగ్లైడింగ్‌, బంగీ జంపింగ్‌.. వంటి సాహసకృత్యాల్ని ధైర్యంగా చేసిన ఆమె.. ‘ఇలాంటివే నిజ జీవితంలో మనకు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాయి..’ అంటూ తన మాటలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
Powered By Margadarsi Computers
This website follows the DNPA Code of Ethics .






