
వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఖైరతాబాద్, బాలాపూర్ వినాయకులను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కాగా.. ఈ నవరాత్రుల వేళ ఈ రెండు ప్రాంతాల్లోని గణేష్ ను భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పలు ప్రాంతా ల నుంచి ప్రత్యేక బస్సులను కేటాయించింది. సమయాలను వెల్లడించింది.
గణేష్ నవరాత్రుల వేళ భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ గణేష్ మండపాల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది. జంట నగరాల నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ సేవలను ఉపయోగించుకుని సుఖవంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చని సూచించారు. ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్, ఎంజీబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లను అనుసంధానిస్తూ సాగుతాయి. జేబీఎస్ నుంచి ప్రారంభమయ్యే బస్సులు ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్, ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐఎస్ సదన్, పిసల్‌బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్స్, శివాజీ చౌక్ మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి.
నగరంలోని అన్ని మార్గాల నుంచి ఈ బస్సుల రూట్ ఖరారు చేస్తుండటంతో భక్తులందరికీ రవాణా సౌకర్యం లభిస్తుందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. బస్సుల సమయాలను ఖరారు చేసారు. జేబీఎస్ నుంచి ఉదయం 6:00 గంటలకే మొదటి సర్వీస్ ప్రారంభమవుతుంది. రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుంచి 50 నిమిషాల వ్యవధితో బస్సులు అందుబాటులో ఉంటాయి. బాలాపూర్ గణేష్ మండపం నుంచి తిరుగు ప్రయాణమయ్యే బస్సులు ఉదయం 7:55 గంటల నుంచి ప్రారంభమై, అర్ధరాత్రి 23:50 గంటల వరకు నడుస్తాయి. అర్ధరాత్రి వరకు సేవలు ఉండటం వల్ల భక్తులకు ప్రయోజన కరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.






