
మహేష్ బాబుకి ఒక్కడు, ప్రభాస్ కి వర్షం, సిద్ధార్థ్ కి నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి భారీ హిట్స్ ఇచ్చిన నిర్మాత ఎం.ఎస్. రాజు (MS Raju) ఇటీవల దర్శకుడిగా మారిపోయారు. సినిమాల నిర్మాణం ఆపేశారు. ఆయన డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం ‘అగధ’ (Agadha) ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలు….
‘అగధ’ అంటే ఏంటి? ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నట్లు ఉన్నారు?
‘అగధ’ అంటే ఏమి కనిపించని లోతైన శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ‘అగధ’. నేను ఇంత వరకు స్టేజ్ మీద అలా ఓపెన్‌గా సినిమా బాగుంది అని స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ‘అగధ’ చూసిన తర్వాత సినిమా బాగుంది, విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది. అదే విషయాన్ని చెప్పా.
ట్రైలర్, టీజర్ చూసి మీ పాత హీరోలు ఏమైనా స్పందించారా?
‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసి మహేష్ బాబు గారు నాకు వాయిస్ మెసెజ్ చేశారు. ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్ అన్నారు. ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు. త్రివిక్రమ్ షూటింగ్లో ఉండగానే వెంకటేష్‌ని కలిశాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
మీరు సడెన్‌గా సినిమాల్ని నిర్మించడం ఆపేశారు.. ఎందుకు?
‘ఆట’, ‘మస్కా’ మంచి చిత్రాలు. కమర్షియల్‌గా విజయాలు అందుకున్నాను. కానీ నా స్టాండర్డ్‌లో లేవు అని చాలా మంది అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయి కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టాను. చాలా ఏళ్ల తర్వాత ‘డర్టీ హరి’ని తీశాను. అది నా టేస్ట్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. నా జర్నీలో ఎప్పుడూ కూడా కొత్త కథలకే ఓకే చెబుతూ వచ్చాను. ఎం.ఎస్. రాజు ఎలాంటి జానర్లో అయినా కూడా సినిమా తీయగలడు అనే పేరు సంపాదించుకోవాలి. నాకు నచ్చిన ఆర్ట్ ఫిల్మ్ తీసే బదులు మంచి కమర్షియల్ సినిమాని తీయడానికే ఇష్టపడతాను.
ఎన్టీ రామారావు గారి గురించి మీరు మాట్లాడిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు…
నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. రామారావు గారి మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న గారు, రామారావు గారికి మంచి అనుబంధం ఉంది. మా నాన్న గారికి రామారావు గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను.
ఇకపై దర్శకుడిగానే కంటిన్యూ అవుతారా? ‘అగధ 2’ ఉంటుందా?
ఇప్పుడు ఆర్థిక విషయాల జోలికి వెళ్లడం లేదు. ఇకపైనా కథ మీద, రైటింగ్ మీద ఫోకస్ పెడుతున్నాను.‘అగధ’ రిలీజ్ అయిన తర్వాత ప్రీక్వెలా? సీక్వెలా? అన్నది చెప్తాను. ఈ మూవీకి ఆ స్కోప్ అయితే ఉంది.





