© 2026 nimisham.in
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే థియేటర్లకు వస్తుండటం, ప్రతీ నెల రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు పడుతుండటంతో ఇండస్ట్రీలో నూతనోత్సవం వచ్చింది. ఒకప్పుడు సినిమాలను రిలీజ్ చేయడానికి ఆలోచించిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ప్రతీ వారం పోటీపడి మరీ సినిమాలు విడుదల చేస్తున్నారు. ఆగస్టు నెలలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'.. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. రవితేజ 'ఇరుముడి' సినిమాలు ఘన విజయం సాధించాయి. మధ్యలో 'హుషార్ పిట్టలు' కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ సినిమాలపై అందరి దృష్టి పడింది.సెప్టెంబర్ నెలలోనూ ప్రేక్షకులను వినోదాన్ని పంచడానికి పలు క్రేజీ చిత్రాలు రెడీ అయ్యాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొదటి వారంలో అర డజనుకు పైగా మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రోమాంచకం'.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఐ యామ్ గేమ్' చిత్రాలు సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతున్నాయి. మరుసటి రోజు నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' సినిమా విడుదల కానుంది. 'మీర్జాపూర్', 'సహ: లైఫ్ ఆఫ్ సంజు', 'మా అందాల రాముడు', 'ధర్మస్థల నియోజకవర్గం' వంటి చిత్రాలు కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ కూడా ఈ వీక్ లోనే రావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందులు వల్ల విడుదలపై సందిగ్దత నెలకొంది.సెప్టెంబర్ రెండో వారంలో వినాయక చవితి పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. కార్తి ‘సర్దార్’.. సుహాస్ - సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’.. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’.. ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'.. ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. మాధవ్ ‘మారెమ్మ’ సినిమాలు సెప్టెంబర్ 10, 11వ తేదీలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మూడో వారం సెప్టెంబరు 18న 90స్ మౌళీ తనూజ్ 'దొంగ నా కొ*కు', ‘సీక్రెట్ సోల్జర్’, ‘అనుమాన పక్షి’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక సెప్టెంబర్ చివరి వారంలో 28వ తేదీన 'ది ప్యారడైజ్' సినిమా రానుంది. ఇలా ఈ నెలలో అనేక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాయి. మరి వీటిల్లో ఏయే సినిమాలు సత్తా చాటుతాయో చూడాలి.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.