
Anupama Parameswaran:నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి తొలిసారి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు రెండేళ్ల పాటు నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఎదురైందని ఆమె వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఆమె చెప్పలేదు.
కొంతకాలం క్రితం అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జీవితంలో మనశ్శాంతిని దూరం చేసే విషయాలను వదిలిపెట్టాలని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆమె ఏదైనా రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చారా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు తన జీవితంలో ఏం జరిగిందో ఆమె వివరించారు. తన సోషల్ మీడియా పోస్ట్ గురించి అనుపమ మాట్లాడుతూ, "ఆ పోస్ట్ ఒక్కరోజులో వచ్చిన ఆలోచన కాదు. దాని వెనుక చాలా జరిగింది. రెండేళ్ల బాధ, శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న నష్టాలు ఆ ఒక్క పోస్ట్ వెనుక ఉన్నాయి" అని చెప్పారు.
తాను పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు. "నేను సిద్ధంగా ఉన్నప్పుడు, నిజంగా హీల్ అయిన తర్వాతే ఏదైనా చెప్పాలని అనుకున్నాను. నా గురించి, నా జీవితంలో జరుగుతున్న ఒక పెద్ద విషయాన్ని గుర్తించిన ఒక ప్రయాణం అది" అని అనుపమ చెప్పారు.
తనకు రెండేళ్ల పాటు నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఎదురైందని ఆమె స్పష్టంగా చెప్పారు. ఈ విషయం గురించి తొలిసారి ఒక వీడియోలో చూసినప్పుడు తనకు చాలా తీవ్రమైన భావోద్వేగం కలిగిందని తెలిపారు. అది చాలా టాక్సిక్ రిలేషన్షిప్ అని, ఆ సమయంలో తన కెరీర్‌పై కూడా ప్రభావం పడిందని చెప్పింది. ముఖ్యంగా డ్రాగన్ వంటి సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా తనను అనుమతించలేదని అనుపమ తెలిపింది. రిలేషన్షిప్ మొదలైన కేవలం మూడు నెలల్లోనే అతని కుటుంబం ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాట్లు కూడా చేసిందని, అయితే అతను వయసులో చాలా చిన్నవాడని ఆమె చెప్పింది. అతని స్వభావాన్ని వివరించేందుకు అనుపమ అన్నియన్ సినిమాలోని క్యారెక్టర్‌ను ఉదాహరణగా చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవారు కొందరు వాటిని వెంటనే గుర్తించలేరని అనుపమ అన్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక చాలాకాలం బాధపడే వ్యక్తులు కూడా ఉంటారని చెప్పారు. అలాంటి వారితో మాట్లాడటం చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.ఆ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిన తర్వాత తాను క్రమంగా తనను తాను కోల్పోయానని అనుపమ తెలిపారు. "నేను ఎదగాల్సిన సమయంలో చిన్నదవుతూ వెళ్లాను. " అనే భావనను ఆమె వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను చాలా బరువు కూడా తగ్గినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే అనుపమకు ధృవ్ విక్రమ్‌తో గతంలో డేటింగ్ రూమర్స్ వచ్చాయి. బైసన్ కాలమాడన్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరిపై ఈ వార్తలు వచ్చాయి. అయితే వారి రిలేషన్షిప్ గురించి ఇద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అనుపమ తాజా వ్యాఖ్యలతో ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది.




