
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం రాకా పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మినహా పెద్దగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రాకా లో నటించే హీరోయిన్ల పాత్రలపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్టులో భాగమని అధికారికంగా వెల్లడించారు. ఆమె సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్లో దీపికా పాల్గొంటున్నారని, ఆమెకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా రాకా లో కీలక పాత్రలు పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్ ఓ గిరిజన యువతిగా కనిపించనున్నారని, ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. రష్మిక పాత్ర మాత్రం మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని, నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని ప్రచారం సాగుతోంది. మృణాల్ ఠాకూర్ కూడా కథలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పాత్రలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే రాకా లో అల్లు అర్జున్ లుక్ భారీగా వైరల్ అయింది. ఎలాంటి లీకులు లేకుండా దర్శకుడు అట్లీ టైటిల్‌తో పాటు బన్నీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రాకా అంటే పౌర్ణమి అనే అర్థం ఉండటంతో సినిమాకు సంబంధించిన కథపై అభిమానులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే యోధుడిగా బన్నీ కనిపించనున్నారని కొందరు భావిస్తుండగా, పగలు మనిషిగా, రాత్రి తోడేలుగా కనిపిస్తారనే మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా జరుగుతోంది.
సైన్స్ ఫిక్షన్ కథకు పౌరాణిక అంశాలను జోడిస్తూ అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రధాన చిత్రీకరణను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





