
Actor Brahmanandam Brother Emotional Video Goes Viral
లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు.
లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు 1250కి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇటీవల కాలంలో సినిమాలు కాస్త తగ్గించిన బ్రహ్మానందం.. 'కామెడీ కింగ్'గా, 'మీమ్ గాడ్'గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎలాంటి వివాదాలు లేకుండా సినీ ప్రయాణం సాగించిన బ్రహ్మానందంపై, ఆయన సొంత అన్నయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.''వృద్ధాప్యంలో తమ్ముడి ప్రేమ, అనురాగం కోసం ఎదురు చూస్తున్న బ్రహ్మానందం అన్నయ్య'' అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''మేము ఆరుగురం అన్నదమ్ములం. ఐదోవాడు బ్రహ్మానందం. నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. ఇక్కడ నేను ఒంటరిగా మిగిలిపోయను. బ్రహ్మానందం ఎప్పుడైనా ఫోన్ చేసి పలకరిస్తాడేమో అని ఎదురు చూస్తున్నా. హైదరాబాద్ నుంచే, ఆయనకు షూటింగ్ లేనప్పుడైనా ఒక్కసారి అయినా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. 'రేయ్ అన్నయ్యా.. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావ్?' అని అడుగుతాడేమో అని అడగొచ్చు కదా అని అనుకుంటాను'' అని అన్నారు.''గొప్పవాళ్ళు పలకరించినప్పుడు నాలాంటి చిన్నవాళ్లకు సంతోషంగా ఉంటుంది. చనువుగా మాట్లాడటానికి బాగుంటుంది. మనకు మనంగా వాళ్ల దగ్గరకు వెళ్తే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. వాడు ఏదో అంటాడని కాదు కానీ, నాకు అలాంటి ఫీలింగ్ ఉంది. నాకు బాధేమీ లేదు కానీ.. 'ఎలా ఉన్నావ్ అన్నయ్యా?' అని ఒక్క మాట అడిగితే చాలు అనేదే నా బాధ. నాకు డబ్బులేమీ అక్కర్లేదు. ప్రేమగా పలకరిస్తే చాలు. అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇటీవల మా ఊరికి వచ్చాడంట. నాకు తెలియదు. అయినా నేను వెళ్లలేను. ఎందుకంటే నేను చిన్నగా నడుస్తాను. అంతమంది జనంలో ఎలా వెళ్లాలో తెలియదు''''వాడు నా ఇంటికి రాకపోయినా పర్వాలేదు. అసలు వాడికి రావడానికి వీలుపడదు. ఎందుకంటే వాడొస్తే జనాన్ని కంట్రోల్ చేయలేం. నా ఇంటిని పగలగొడతారు. అందుకే 'ఎవరినైనా తీసుకొని హైదరాబాదుకి రా అన్నయ్యా.. ఒకసారి చూడాలని ఉంది' అని పిలిపిస్తే చాలు. నాకు ఏమీ వద్దు. నాకు కూతుళ్లు అన్నం పెడుతున్నారు. బ్రహ్మంగారి గుడిలో పూజారిగా చేస్తున్నాను. పావలాబేడా వస్తుంటాయి. నాకు ఉన్నంతలో హాయిగా ఉన్నాను. కానీ పలకరింపు లేదు. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు'' అంటూ బ్రహ్మానందం సోదరుడు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీనివాసరావు మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో, బ్రహ్మానందం తన సొంత అన్నని పట్టించుకోవడం లేదు, కనీసం పలకరించట్లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అదే ఇంటర్వ్యూలో బ్రహ్మానందం తన కుటుంబానికి చేసిన సాయం గురించి కూడా శ్రీనివాసరావు మాట్లాడారు. బ్రహ్మానందం తనకు ఇల్లు కట్టించాడని, తన ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కూడా చేశారని వెల్లడించారు. తనతో పాటుగా మిగతా తోడబుట్టిన వారికీ తన తమ్ముడు సాయం అందించాడని తెలిపారు.''ఇప్పుడు నేనుంటున్న ఇల్లు కట్టించింది వాడే. నా ముగ్గురు కూతుర్లకు వాడే పెళ్లిళ్లు చేశాడు. ఆ రోజుల్లో 50 వేలకు పైగా ఖర్చు చేసి పెళ్లిళ్లు చేశాడు. అప్పట్లో కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఆదుకునేవాడు. మా ఆరోవాడు పూర్ణకి బ్రహ్మానందం చాలా సాయం చేశాడు. చాలామందికి చేశాడు. పేదవాడికి, ఉన్నవాడికి మధ్య తేడా కూడా వాడిలో కనిపించదు. కానీ 'అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు.. ఏమనుకుంటాడో' అని మేము అనుకుంటాము. వాడికి అలాంటి భావన ఉండదనే నేను అనుకుంటున్నాను'' అని బ్రహ్మానందం సోదరుడు చెప్పారు. అయితే ఆయన మాట్లాడిన ఫుల్ వీడియో చూడకుండా కొందరు బ్రహ్మానందంపై విమర్శలు చేస్తున్నారు. పూర్తి వీడియో చూసినవారు మాత్రం శ్రీనివాసరావు నెగటివ్ గా ఏం చెప్పలేదని, తన ఆవేదన మాత్రమే చెప్పుకున్నాడని అభిప్రాయపడుతున్నారు.బ్రహ్మానందం చదువు కోసం చిన్నతనంలోనే అత్తిలి వెళ్లిపోయాడని, అక్కడే లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాడని శ్రీనివాసరావు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, తమ తండ్రికి నచ్చకపోయినా తాము నచ్చజెప్పి పెళ్లికి వెళ్లామని చెప్పారు. బ్రహ్మానందం సినిమాల్లో అవకాశం సంపాదించి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడని ఆయన అన్నయ్య గుర్తు చేసుకున్నారు.






