
ఖరీదైన కొత్త స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఫోన్ కొన్న యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఘజియాబాద్ నుంచి తన స్వగ్రామమైన దంకోర్కు తిరిగి వస్తున్న మజీద్ అనే యువకుడి జేబులో స్మార్ట్ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. నెల రోజుల క్రితమే కొనుగోలు చేసిన ఈ ఫోన్.. ప్రయాణంలో ఉండగా విపరీతంగా వేడెక్కింది. బాధితుడు ఫోన్ను జేబులోంచి బయటకు తీసేలోపే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో మజీద్ దుస్తులకు నిప్పంటుకోవడంతో పాటు అతని రెండు చేతులకూ తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫోన్ ముక్కలుముక్కలైంది. బాధితుడి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి మంటలు ఆర్పేసి.. చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఫోన్లోని లిథియం-అయాన్ బ్యాటరీ దెబ్బతినడం లేదా తయారీ సమయంలో ఏర్పడిన అంతర్గత లోపం కారణంగా బ్యాటరీలో సమస్య తలెత్తి ఫోన్ పేలి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం ఛార్జర్లు, ఫోన్ని గంటల పాటు వాడటంతో హీట్ కావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు సాధ్యమైనంత వరకూ ఫోన్ను ఆఫ్ చేసుకొని ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News





