Financial Planning : ప్రస్తుత రోజుల్లో ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో మార్పులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో అనిశ్చితి వంటి అంశాలు వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా ఇబ్బందుల్ని సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక రాబడి ఇచ్చే పెట్టుబడిని వెతకడం మాత్రమే సంపద సృష్టికి చాలదు. డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా తెలిసుండాలి. మీరు సంపాదించిన ఆదాయాన్ని రక్షించుకోవడానికి ఇంకా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండటం, బీమా తీసుకోవడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి ప్రాథమిక ఆర్థిక అలవాట్లే దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతకు పునాది వేస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ గురించి చూద్దాం. ఎమర్జెన్సీ ఫండ్- పెట్టుబడులు ప్రారంభించడం కంటే ముందుగానే అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా కనీసం 6 నుంచి 12 నెలల వరకు అవసరమైన ఖర్చులకు సరిపడినంత మొత్తాన్ని ఫండ్‌గా ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, అత్యవసర వైద్య ఖర్చులు ఇలా పలు పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. అప్పులు, క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్- కుటుంబంపై ఆర్థిక బాధ్యతలు ఉన్న వారు అంటే సంపాదించేవారు తగిన మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెళ్లి తర్వాత, కుటుంబ సభ్యులు మీ ఆదాయంపై ఆధారపడుతున్నప్పుడు జీవిత బీమా ప్రాధాన్యం తెలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీ తదనంతరం వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్- వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క పెద్ద ఆస్పత్రి ఖర్చే మీ మొత్తం పొదుపును ఖాళీ చేసే ప్రమాదం ఉంది. అందుకే వ్యక్తిగత అవసరాలకు సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ వీలైనంత త్వరగా తీసుకోవాలి. సిప్ పెట్టుబడులు- పెట్టుబడుల్ని ఆలస్యంగా చేయకుండా వీలైనంత త్వరగా ప్రారంభించాలి. మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫండ్లలో సిప్ పెట్టుబడి ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద సమకూరుతుంది. కాంపౌండింగ్ ఇక్కడ సంపద సృష్టిలో కీలకంగా వ్యవహరిస్తుంది. స్టెప్ అప్ సిప్- మీకు ఏటా జీతం పెరుగుతున్న కొద్దీ సిప్ పెట్టుబడుల్ని పెంచాలి. ఇక్కడ మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా కనీసం 5-10 శాతం వరకు పెంచుతూ పోయినా సంపద మరింత పెరుగుతుంది. అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండాలి- క్రెడిట్ కార్డు బకాయిలు, అధిక వడ్డీ ఉండే వ్యక్తిగత రుణాలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. ఇది సంపద సృష్టికి తీవ్ర అడ్డంకిగా మారొచ్చు. అవసరం లేని అప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. పెట్టుబడులన్నీ ఒకే చోట కాదు- మొత్తం డబ్బును ఒకే పెట్టుబడి సాధనంలో పెట్టడం వల్ల రిస్క్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి పలు అసెట్లలో విభజించుకోవాలి. పన్ను ప్రణాళిక- పన్ను ఆదా కోసం ఆర్థిక సంవత్సరం చివర్లో హడావుడిగా పెట్టుబడులు పెట్టడం కాకుండా ఏడాది ప్రారంభం నుంచి ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆర్థిక లక్ష్యాల సమీక్ష- జీతం, కుటుంబ పరిస్థితులు, పిల్లల విద్య, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్, వివాహం ఇలా అన్ని లక్ష్యాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇందుకోసం ఏడాదికి ఒకసారి అయినా పొదుపు, పెట్టుబడులు, బీమా వంటి వాటిని సమీక్షించుకోవాలి. నామినీ, ఆస్తుల వివరాలు- బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు వంటి ఆస్తులకు నామినీ వివరాల్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ముఖ్యమైన ఆర్థిక పత్రాలు, పెట్టుబడి వివరాలు, బీమా పాలసీలు వంటివి సక్రమంగా ఉంటే భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు ఆస్తుల నిర్వహణ సులభతరమవుతుంది.





